ప్రోత్సాహకాలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహకాలు విడుదల చేయాలి

Sep 12 2026 11:03 AM | Updated on Sep 12 2026 11:03 AM

ప్రోత్సాహకాలు విడుదల చేయాలి మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

అనంతగిరి: మూడేళ్లుగా నిలిచిపోయిన ఎస్సీ, ఎస్టీ బాధితుల ఎక్స్‌గ్రేషియా, కులాంతర వివాహితుల ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ప్రసాద్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

అనంతగిరి: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని వికారాబాద్‌ సీఐ రఘుకుమార్‌ సూచించారు. శుక్రవారం రాత్రి వికారాబాద్‌లోని ప్రధాన చౌరస్తాలో వాహనాల తనిఖీ చేశారు. పలువురు మైనర్లు బైకులు నడుపుతుండటంతో వారికి కౌన్సిలింగ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

బషీరాబాద్‌: ఎలాంటి పత్రాలు లేకుండా వాగు నుంచి మైల్వార్‌ గ్రామానికి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇసుక లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్‌ శ్రీకాంత్‌ పోలీసుల మీదకు ట్రాక్టర్‌ను నడిపేందుకు ప్రయత్నించాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు బషీరాబాద్‌ ఎస్‌ఐ విఠల్‌ తెలిపారు. డ్రైవర్‌తోపాటు ట్రాక్టర్‌ యజమాని సూర్యప్రకాశ్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నవాబుపేట: ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం ఎల్లకొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాశీపురం కిష్టమ్మ(50) ఉదయం జిరాక్స్‌ షాపునకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఇర్లపల్లి ప్రశాంత్‌ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుమార్తె స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వ్యాపారి అదృశ్యం

మీర్‌పేట: ఇంట్లోంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శోభన్‌ తెలిపిన ప్రకారం.. మీర్‌పేటకు చెందిన పెద్దయ్య కుమారుడు చెంగల బంగారి (41) వ్యాపారి. ఈ నెల 8వ తేదీన ఆఫీసుకు వెళ్తున్నానని భార్యకు చెప్పి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

హామీల అమలులో

కాంగ్రెస్‌ విఫలం

ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి

షాద్‌నగర్‌: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేశంపేట మండలం బొదనంపల్లికి చెందిన శేఖర్‌, మాజీ ఉప సర్పంచ్‌ లింగారెడ్డి ఎమ్మెల్సీ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్‌ ప్రజాపాలనలో ప్రజలకు కష్టాలు తప్ప మేలు జరిగిందేమీ లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్‌ పంతులు, తాండ్ర విష్ణువర్ధన్‌రెడ్డి, యారం శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గంజాయి చాకెట్లు స్వాధీనం

కొత్తూరు: పట్టణంలో అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకితీసుకున్నారు. 8వ వార్డులోని హనుమాన్‌ ఆలయం సమీపంలో నివసిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన భోలా(45) తన ఇంట్లోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసి నిషేధిత గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోదాలు నిర్వహించి, 70 చాక్లెట్లు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement