దుర్గం చెరువు ప్రక్షాళనకు పక్కా వ్యూహం | - | Sakshi
Sakshi News home page

దుర్గం చెరువు ప్రక్షాళనకు పక్కా వ్యూహం

Sep 12 2026 11:03 AM | Updated on Sep 12 2026 11:03 AM

దుర్గం చెరువు ప్రక్షాళనకు పక్కా వ్యూహం ‘విమోచన’ను అధికారికంగా నిర్వహించాలి

జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి

సాక్షి, సిటీబ్యూరో: దుర్గం చెరువులోకి మురుగు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.అశోక్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుర్గం చెరువులోకి వచ్చే నాలాలు, మురుగునీటి ప్రవాహాలు, ఎస్టీపీలు వర్షపు నీటి కాలువల పనితీరును శుక్రవారం ఆయన పరిశీలించారు. 2047 నాటికి పెరిగే మురుగునీటి పరిమాణానికి అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. నాలాల ప్రారంభ స్థానం నుంచి చెరువు వరకు ప్రవాహ మార్గాలన్నింటినీ గుర్తించి సమగ్ర ప్రవాహ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. వర్షం లేని రోజుల్లో నాలాల్లో మురుగు లేకుండా ప్రత్యేక పైపులైన్‌ ద్వారా ఎస్టీపీలకు తరలించాలని సూచించారు. చెరువు పరీవాహక ప్రాంతంలోని హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, హైరైజ్‌ భవనాలలోని ప్రైవేట్‌ ఎస్టీపీల పనితీరు, ఉత్పత్తి అయ్యే మురుగు, నీటి శుద్ధి నాణ్యతపై సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. వ్యర్థాలు ఉత్పత్తయ్యే మూలస్థాయిలోనే వాటిని అడ్డుకునే చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం హైడ్రా , జీహెచ్‌ఎంసీ , హెచ్‌ఎండీఏ, నీటిపారుదల శాఖలతో కలిసి పనిచేయాలని జలమండలి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అశోక్‌రెడ్డి వెంట సైబరాబాద్‌ ఈడీ సంతోష్‌, ఎస్టీపీ సీజీఎం పద్మజ, జీఎం హరిశంకర్‌తదితరులు ఉన్నారు.

షాద్‌నగర్‌: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్‌ శ్రీవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం షాద్‌నగర్‌ పట్టణంలో బీజేపీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభిస్తే హైదరాబాద్‌ సంస్థానానికి 1948 సెప్టెంబర్‌ 17న విముక్తి లభించిందన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించిన ఎంతో మంది తెలంగాణ వీరులు ప్రాణాలు కోల్పోయారన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17 అత్యంత కీలకమైన రోజని తెలిపారు. అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, దేపల్లి అశోక్‌గౌడ్‌, ప్యాట అశోక్‌, మచ్చ సుధాకర్‌, వంశీకృష్ణ, మురళీ, నర్సింహ్మ, ఇస్నాతి శ్రీను, సురేష్‌, రుషి, రణదీర్‌, రాజు, శ్రీను, మల్లేష్‌, రఘు, రవి నాయక్‌, సాయికుమార్‌, ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement