జిల్లాకు అసెంబ్లీ సెగ | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు అసెంబ్లీ సెగ

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

వికారాబాద్‌: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చెలరేరిగిన మంటల సెగ జిల్లాకు తాకింది. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టిస్తున్నాయి. స్పీకర్‌ సొంత నియోజకవర్గం వికారాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగాయి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనన్యతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ర్యాలీలు తీశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు, తాతా మధు దిష్టి బొమ్మలను దహనం చేశారు. మంగళవారం ఇరు పార్టీల నేతలు పోటా పోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

బీఆర్‌ఎస్‌ సైతం..

మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితారెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా పోలీసులు దురుసుగా వ్యవహరించటంపై ఆ పార్టీ జిల్లా నాయకులు రోడ్డెక్కారు. ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ తోపాటు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలను హౌస్‌ అరెస్టు చేశారు. పరస్పర విమర్శలు, ఆరోపణలు, ధర్నాలు, ర్యాలీలతో జిల్లా కేంద్రం అట్టుడికింది. తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో కూడా ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు కొనసాగాయి.

వారం రోజులుగా ఇదే పరిస్థితి

నాలుగు రోజుల క్రితం కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో ఆ పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కొడంగల్‌, బొంరాస్‌పేట, వికారాబాద్‌, పరిగి ప్రాంతాల్లో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని సైతం అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారు. అప్పటి నుంచి నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణ ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటాపోటీ నిరసనలు

ముఖ్యనేతల దిష్టి బొమ్మల దహనం

తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ శ్రేణుల ఆగ్రహం

కేటీఆర్‌, సబితారెడ్డిపై పోలీసుల తీరును విమర్శించిన గులాబీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement