అనంతగిరి: ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త కాళోజీ నారాయణరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళోజీ తన రచనలు, కవిత్వంతో ప్రజా సమస్యలను ప్రపంచానికి చాటారని తెలిపారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన సాహిత్యంలో ప్రతిబింబించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆలోచనా విధానం నేటి తరానికి స్ఫూర్తి దాయకమన్నారు. యువత ఆయన సాహిత్యాన్ని అధ్యయనం చేసి సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు మాధవరెడ్డి, జైపాల్‌రెడ్డి, డీఆర్‌ఓ స్వర్ణలత, ఆర్‌డీఓ వాసుచంద్ర, డిప్యూటీ కలెక్టర్ పూజ, డీఏఓ కవిత, డీపీఆర్‌ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
మట్టి గణపతులనే పూజిద్దాం
మట్టి గణపతులనే పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం కలెక్టర్‌కు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ఇంజనీర్ శరత్‌చంద్ర మట్టి విగ్రహాన్ని అందజేశారు. అనంతరం వినాయక చవితి వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో చెరువులు, కుంటల్లో నీరు కలుషితమవుతుందన్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూ చించారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బందికి విగ్రహాలు అందజేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, జెడ్పీ సీఈఓ సుధీర్, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు మాధవరెడ్డి, జయపాల్ రెడ్డి, డీపీఓ జయసుధ, డీపీఆర్‌ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దాం
కలెక్టర్ దీపక్ తివారి


