చేవెళ్ల: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవాడికి అందించేందుకు కృషి చేస్తున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని ఖానాపూర్ గేట్ సమీపంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం చేవెళ్ల మండల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ, నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఇందిరమ్మ మైనార్టీ మహిళా లబ్ధిదారులకు ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ఆదుకుంటోందని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన సమస్య తీరిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం డిజిటల్‌గా ఉండేలా స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోందని చెప్పారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య, చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతారెడ్డి, వైస్ చైర్మన్ రాములుగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షఱుడు గిరిధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అద్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, రవి, రాంచంద్రయ్యగౌడ్, జ్యోతిభూపాల్, కౌన్సిలర్లు శైలజారెడ్డి, ఎం.కళ్యాణి, గోపాల్‌రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, నాయకులు మదుసుదన్‌గుప్తా, రాంరెడ్డి, తదితరులు ఉన్నారు.


