కుల్కచర్ల: మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పది నెలలుగా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు. వివరాలు.. మండల కేంద్రంలోని అజయ్ జ్యువెలర్స్ యజమాని నరేందర్ అనే వ్యక్తి తమను మోసం చేసి నగదు, బంగారు తీసుకుని పరారయ్యాడని.. దాదాపు రూ. 2కోట్ల వరకు నష్టపోయామని 40 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులో ఎటువంటి పురోగతి లేదని మంగళవారం బాధితులు సదరు దుకాణం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పది నెలలు గడుస్తున్నా పోలీసులు నిందితుడిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. రాజస్థాన్‌కు వెళ్లి నిందితుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని చెప్పిన పోలీసులు దొంగ పారిపోయాడని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. ఇప్పటికై నా పోలీసులు చొరవ తీసుకుని తాము కష్టపడి సంపాదించుకున్న నగదు, బంగారం తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆందోళనలో రఘు, శ్రీను, గోపాల్, హన్మ్యనాయక్, చందర్, తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయమై ఎస్‌ఐ రమేశ్‌ను వివరణ కోరగా విచారణ కొనసాగుతోందని గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం
బంగారు దుకాణం ఎదుట ఆందోళన


