అనంతగిరి: సర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఓటరు పూర్తి వివరాలు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కడా జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. మ్యాపింగ్ కాని, అనామలిస్ ఓటర్లకు నోటీసులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అనంతరం 22ఏ భూముల వివరాలు, పెండింగ్ దరఖాస్తులు తదితర వాటిపై ఆరా తీశారు. భూముల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆర్‌డీఓ వాసుచంద్ర, సీపీఓ వెంకటేశ్వర్లు, డీపీఓ జయసుధ, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నోటీసుల ప్రక్రియను వేగవంతం చేయాలి
కలెక్టర్ దీపక్ తివారి


