బొంరాస్‌పేట: ఖరీఫ్– 2026లో సన్నరకం వరి పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని ఏఈఓలు సూచించారు. మండల పరిధిలోని బాపల్లి, నాందార్‌సూర్, బొట్లోనితండా, తుంకిమెట్ల గ్రామాల్లో సోమవారం సన్నరకం వరి వేసిన రైతుల బోనస్ కోసం సంబంధిత డీలర్ లేదా ఏఈఓల వద్ద నమోదుపై అవగాహన కల్పించారు. ఈనెల 10 వరకు సన్నరకం వరి పంటను నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఏడు రకాల ధాన్యాలకు బోనస్ కల్పిస్తోందన్నారు. పట్టాదారు పాసుబుక్కు, ఆధార్‌కార్డు తీసుకెళ్లి నమోదు చేయించుకోవాలని తెలిపారు.
హామీల అమలులో విఫలం
బీఆర్‌ఎస్ నాయకులు
కొడంగల్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో డీటీ అనితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల గడిచినా హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎకరానికి రూ.15 వేలు రైతు బంధు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు రూ.2,500 ఎక్కడని ప్రశ్నించారు. వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు పింఛన్ల మొత్తం పెంచలేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద తులం బంగారం ఎప్పుడిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయడం లేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎరన్‌పల్లి శ్రీనివాస్, మున్నూరు బిచ్చప్ప, శ్రీనివాస్‌రెడ్డి, మాఫీ వెంకటయ్య, ఏర్పుల మోహన్, జగన్, బాల్‌రాజు, హన్మంతు, రాజశేఖర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వం..
శివపార్వతుల కల్యాణం
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శివపార్వతుల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయ ధర్మకర్త సాత ఆత్మలింగం కుటుంబీకులు కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం ప్రత్యేక హారతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 92 ఫిర్యాదులు
మర్పల్లి: మండల పరిసత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదుదారులు పోటెత్తారు. మొత్తం 92 మంది అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శాంతతో పాటు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.


