● మార్కెట్ యార్డులో
బెంచీలు ఏర్పాటు చేస్తాం
● వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్
అనంతగిరి: రైతు విశ్రాంతి భవనం నిర్మాణానికి పాలకవర్గం తీర్మానించిందని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. ఈమేరకు సోమవారం మార్కెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మార్కెట్ కమిటీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ప్రహరీ నిర్మించాలని, రైతులు కూర్చునేందుకు మార్కెట్ యార్డులో బెంచీలు ఏర్పాటు చేయాలని పాలకవర్గం నిర్ణయించిందని వివరించారు. పంట ఉత్పత్తులు తీసుకువచ్చిన రైతులకు తూకాల్లో ఆలస్యం జరిగితే సేద తీరేందుకు విశ్రాంతి భవనం నిర్మిస్తామన్నారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాలకవర్గ సభ్యులు, రైతులతో కలిసి మార్కెట్ యార్డులో ఉచిత సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్లు విజయేందర్‌రెడ్డి, ప్రభాకర్, పాండురంగారెడ్డి, రంగారెడ్డి, రమేష్ నాయక్, రాజునాయక్, పాపిరెడ్డి, మిర్యానం సురేష్, నాగిరెడ్డి, భీమయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.


