అందుబాటులోకి అత్యవసర వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి అత్యవసర వైద్య సేవలు

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

● క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ప్రారంభం ● రూ.5 భోజనం ప్రారంభం ● అతిథి గృహం, పాఠశాల భవనాల ప్రారంభోత్సవాలు

కొడంగల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం పట్టణంలోని పలు భవనాలను అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేశారు. ఉదయం నుంచి కొడంగల్‌లో సీఎం షెడ్యూల్‌ బిజీ, బిజీగా ఉన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద పడకల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నూతన భవనాన్ని ప్రారంభించారు. విపత్కర పరిస్థితుల్లో కొడంగల్‌ ఆస్పత్రికి వచ్చే బాధితులకు అత్యవసర సేవలు అందించడానికి ఈ యూనిట్‌ను మంజూరు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొని రావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లకుండా అన్ని రకాల వైద్య సేవలు కొడంగల్‌లోనే కల్పించారు. ఈ సందర్భంగా పలువురు నర్సులు, నర్సింగ్‌ విద్యార్థులు సీఎంకు రాఖీలు కట్టారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించిన రూ.5 భోజనం ఇందిరమ్మ క్యాంటిన్‌ ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చిన పలువురికి సీఎం భోజనం వడ్డించారు. క్యాంటిన్‌ ద్వారా హరే కృష్ణ పౌండేషన్‌ ఆధ్వర్యంలో రోగులకు నాణ్యమైన భోజనం అందిస్తారని చెప్పారు. పట్టణంలో మెయి న్‌ రోడ్డు పక్కన రూ.8.5 కోట్ల వ్యయంతో ఆధునాతన వసతులు, సౌకర్యాలతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని ప్రారంభించారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్‌, అరబిందో ఫార్మా లిమిటెట్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.8 కోట్లతో నిర్మించిన జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, మండల పరిషత్‌ బాలికల ప్రాథమిక పాఠశాల నూతన భవనాలను ప్రారంభించారు. కొత్త భవనంలో గణపతి, సరస్వతి, వేంకటేశ్వర స్వామి ఫొటోలకు పూజలు చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించిన అరబిందో ఫార్మా పౌండేషన్‌ను రేవంత్‌రెడ్డి అభినందించారు. కోస్గిలో రూ.4 కోట్ల తో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం శిలాఫలకాన్ని కూడా కొడంగల్‌లోనే ప్రారంభించారు. కార్యక్రమంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ దీపక్‌ తివారి, అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ సీఎస్‌ఆర్‌ హెడ్‌ సదానందరెడ్డి, సీనియర్‌ వైస్‌ ప్రసిడెంట్‌ డాక్టర్‌ ఐఎస్‌ఆర్‌ రావ్‌, కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేష్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌నుప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రికి రాఖీ కడుతున్న నర్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement