బీజేపీ ఐటీ విభాగం జిల్లా ఇన్‌చార్జ్ రవీందర్ రోడ్డు కోసం మహాధర్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పాల్గొన్న ఆయా పార్టీల నాయకులు
పూడూరు: అంగడిచిట్టంపల్లి – కంకల్ లాల్పహాడ్ రోడ్డు పనులు చేపట్టడంతో ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టడం లేదని బీజేపీ ఐటీ విభాగం జిల్లా ఇన్‌చార్జ్ రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేనేళ్లుగా బీటీ రోడ్డు గుంతలమయంగా మారి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. శనివారం పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు అంగడిచిట్టంపల్లి స్టేజ్ హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 24 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. 18 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కంకల్ నుంచి లాల్‌పహాడ్ వరకు డబు ల్ రోడ్డు పనులు ప్రారంభించారు. అయితే సకాలంలో బిల్లులు రాక కాంట్రాక్టర్ పనులు మధ్యలో ఆపేశాడని తెలిపారు. రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో వాహనాలు పాడవడం, తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేరుకే సీఎం జిల్లా అని అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉందన్నారు. వెంటనే రోడ్డు పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదవరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింలు, బీఆర్‌ఎస్ నాయకులు పాండు, శ్రీనివాస్, బీజేపీ నాయకులు రవీందర్, రాజు, మనోహర్‌గౌడ్, మహేందర్ గౌడ్, భూపాల్, కోట్ల శంషూ, ఆయా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


