తాండూరు: ఉపాధ్యాయ దినోత్సవం వంటి పవిత్రమైన రోజున విద్యార్థులను రాజకీయ ర్యాలీలకు వినియోగించడం సిగ్గుచేటని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ విమర్శించారు. రోడ్లపై సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునే రోజున విద్యార్థులు ఉపాధ్యాయులు వేడుకల్లో పాల్గొనాల్సిన సమయంలో వారిని రోడ్లపై నిలబెట్టి రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల మద్దతు లేక విద్యార్థులను ర్యాలీలకు తీసుకువచ్చి రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు, యువత సంక్షేమం కోసం అనేక కీలక చర్యలు చేపట్టిందని అన్నారు. ఇప్పటి వరకు 60 వేల ఉద్యోగాలను భర్తీ చేపట్టడంతో పాటు హాస్టల్ మెస్ చార్జీలను పెంచామని తెలిపా రు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బ్రే క్‌ఫాస్ట్ అందిస్తున్నామన్నారు. తాండూరులో జీఓల కు పరిమితమైన ఐటీఐ కళాశాల సమస్యను పరిష్కరించి ఏటీసీ ద్వారా విద్యార్థులకు నైపుణ్య విద్య అందుతోందని తెలిపారు. ఇంతటి కార్యక్రమాలను చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోహిత్‌రెడ్డి విమర్శించడం సరికాదని అన్నారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.


