నేటినుంచి ఏకాంబరి జాతర | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి ఏకాంబరి జాతర

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

నాలుగు రోజుల పాటు వేడుకలు

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి

సప్తకొలనుల్లో స్నానం..

సర్వ పాప హరణం

తెలంగాణ, కర్ణాటక నుంచి

వేలాదిగా తరలిరానున్న భక్తులు

భారీగా పోలీసు బందోబస్తు

బషీరాబాద్‌: జిల్లా సరిహద్దులోని నీళ్లపల్లి అటవీ ప్రాంత సప్తకొలనుల మధ్య వెలసిన పురాతన శ్రీ ఏకాంబర రామలింగేశ్వరస్వామి జాతర ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేయగా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఏటా శ్రావణమాసం చివరి సోమవారం వేడుకలను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా సప్తకొలనుల్లో పుణ్యస్నానం ఆచరించి, అనంతరం మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ స్నానం చేస్తే ఏళ్లనాటి పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తాండూరు, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, సేడం తదితర ప్రాంతాల నుంచి ప్రతి ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.

ఆలయ చరిత్ర

త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్యా పాతక విముక్తి కోసం శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడనే స్థానిక గాథ ఈ క్షేత్రానికి చారిత్రక విశిష్టతను తీసుకొచ్చింది. ఆలయ సమీపంలోని యాకూబ్‌సాబ్‌ జీవసమాధి మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హిందూ, ముస్లిం భక్తులు ఆలయం, దర్గాను దర్శించుకోవడం ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘనటలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాండూరు సబ్‌డివిజన్‌ నుంచి 60 మందికి పైగా పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఐ విఠల్‌ తెలిపారు.

కార్యక్రమాల వివరాలు

● ఆదివారం నీళ్లపల్లి గ్రామం నుంచి పల్లకీ ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

● సోమవారం జాతర మహోత్సవం, సాయంత్రం రథోత్సవం, ప్రత్యేక పూజలు

● మంగళవారం అర్ధరాత్రి లంకాదహనం

● బుధవారం జాతర ముగింపు కార్యక్రమాలు జరగతాయని ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement