తాండూరు: పట్టణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని తాండూరు బార్ అసోషియేషన్ ప్రతినిధులు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్యే బీఎమ్మార్‌తో కలిసి వెళ్లి, కొడంగల్ పర్యటనకు వచ్చిన సీఎంను కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కురువ శ్రీనివాస్, న్యాయవాదులు మహేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మస్తాన్ తదితరులు ఉన్నారు.
మహాధర్నాకు తరలిన
బీజేపీ నేతలు
తాండూరు: రైతుల భూములను 22– ఏ నిషేధిత జాబితా పేరుతో అక్రమంగా నమోదు చేస్తున్నారంటూ బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నా దీక్ష కార్యక్రమానికి శనివారం ఆ పార్టీ నాయకులు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజవకర్గాల నుంచి నగరానికి తరలివెళ్లారు. వీరిలో నాయకులు మాధవరెడ్డి, బాలేశ్వర్‌గుప్తా, శివరాజ్, మారుతి, కిరణ్, రాజ్, కృష్ణముదిరాజ్, రాముయాదవ్, కేశవులు, భద్రేశ్వర్ తదితరులు ఉన్నారు.
సరైన ధ్రువీకరణ పత్రాలు అందజేయండి
తాండూరు రూరల్: సర్ నోటీసులు వచ్చిన ఓటర్లు సరైన ధ్రువపత్రాలు అందజేయాలని ఆర్‌ఐ రాఘవేందర్‌రావు అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో నో మ్యాపింగ్‌కు సంబంధించి నోటీసులపై విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధింత బీఎల్‌ఓలకు సంప్రదించాలని సూచించారు. నో మ్యాపింగ్, అనామలిస్‌కు నోటీసులు పొందిన ఓటర్లు సంబంధింత ఈఆర్‌ఓలకు ఆధారాలు చూపిస్తే తిరిగి ఓటు హక్కు పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ కల్పన, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
తాండూరులో
దొంగల హల్‌చల్
వరుస చోరీలతో ప్రజల్లో ఆందోళన
తాండూరు: పట్టణంలోని సాయిజానకి నగర్‌లో మరో ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ పరమేశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన ఆంజనేయులుగౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం వేరే గ్రామానికి వెళ్లారు. శనివారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోకి చొరబడిన దొంగలు రెండు తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి సాయిజానకినగర్‌లో ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్రవాహనాలను దొంగలు అపహరించిన విషయం తెలిసిందే. అలాగే శ్రీ రామ్‌నగర్‌లోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి 10 తులాల బంగారం.. 2 కిలోల వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ఒకే రోజు పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరు స చోరీలు జరగడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరమైంది. శ్రీరాంనగర్‌లో సాయిజానకినగర్ ప్రాంతాల్లో జరిగిన చోరీలకు ఒకే ముఠా పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.


