విలీన పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

విలీన పంచాయితీ

Sep 5 2026 7:25 AM | Updated on Sep 5 2026 7:25 AM

భారత్‌ ఫ్యూచర్‌సిటీలో గ్రామాల చేరిక మహేశ్వరం మండలంలో 30 పంచాయతీలు ఇప్పటి వరకు రెండు గ్రామాలే విలీనం మరో 28 గ్రామాల నుంచిపెరుగుతున్న ఒత్తిడి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య తీర్మానాల చిచ్చు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఫ్యూచర్‌సిటీలో పంచాయతీల విలీన అంశం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదాస్పదంగా మారింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు కై వసం చేసుకున్న పంచాయతీలు విలీనానికి అనుకూలంగా తీర్మానాలు చేసి పంపుతుండగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు సర్పంచులుగా ఉన్న గ్రామాలు ఇందుకు నిరాకరిస్తున్నాయి. భారత్‌ ఫ్యూచర్‌సిటీ భవిష్యత్తు పెట్టుబడులకు స్వర్గధామమని అధికార కాంగ్రెస్‌ ప్రచారం చేస్తుంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని, తర్వాత ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తామని బీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో పంచాయతీల విలీన అంశం రెండు పార్టీల మధ్య రాజకీయ దుమారానికి దారి తీస్తోంది.

ఇప్పటికే 56 రెవెన్యూలు విలీనం

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కందుకూరు, యాచారం, కడ్తాల్‌ మండలాల పరిధిలో 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని భావించింది. ఆ మేరకు 2023 నాటికి 13,500 ఎకరాలు సేకరించింది. 2024లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలుష్య భూతాన్ని వెదజల్లే ఫార్మాసిటీని రద్దు చేసి, దాని స్థానంలో కాలుష్య ఉద్గరాల రహిత నెట్‌ జీరోసిటీ/ భారత్‌ ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 మార్చి 12న ఏడు మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలు, 74 పంచాయతీలు, 765.28 చదరపు కిలోమీటర్లు (1,88,959 ఎకరాలు)తో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేసింది. కందుకూరు 18, యాచారం 17, ఇబ్రహీంపట్నం ఎనిమిది, కడ్తాల్‌ ఆరు, మంచాల మూడు, ఆమనగల్లులో రెండు, మహేశ్వరం రెండు రెవెన్యూ గ్రామాల చొప్పున ఇందులో విలీనం చేశారు. తర్వాత యాచారం, మహేశ్వరం, మాడ్గుల, కడ్తాల్‌ మండలాల నుంచి కొత్తగా మరికొన్ని విజ్ఞప్తులు అందాయి.

ఒకే అంశం.. భిన్న స్వరాలు

ఎఫ్‌సీడీఏ పరిధిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానుండడం, శరవేగంగా అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాలు సమకూరడం సహా భవిష్యత్తులో ఇక్కడి భూములకు భారీ డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో సరిహద్దు పంచాయతీల నుంచి విజ్ఞప్తులు మొదలయ్యాయి. తమ గ్రామాలను సైతం ఎఫ్‌సీడీఏ పరిధిలోకి తీసుకోవాలన్న డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో పంచాయతీలు తీర్మానం చేసివ్వాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విలీన పంచాయతీ షురూ అయింది. విలీనానికి అనుకూలంగా కాంగ్రెస్‌ అనుబంధ పంచాయతీలు తీర్మాణాలు చేసి ఇవ్వగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోని పాలక వర్గాలు ఇందుకు విముఖత చూపుతున్నాయి. తీరా విలీనం చేసిన తర్వాత పరిశ్రమల పేరుతో ప్రభుత్వం ప్రజల భూములను స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందనే ప్రచారం కూడా విముఖతకు కారణమని తెలుస్తోంది.

జేఏసీగా ఏర్పడి దీక్షలు

మహేశ్వరం మండలంలో 30 పంచాయయతీలు ఉండగా, వీటిలో ఇప్పటికే తుమ్మలూరు, మొహబ్బత్‌నగర్‌ రెవెన్యూ గ్రామాలను ఎఫ్‌సీడీఏలో విలీనం చేసింది. మరో 28 పంచాాయతీలు మిగిలిపోగా, కాంగ్రెస్‌ పాలక వర్గాల చేతిలో 11 ఉండగా, బీఆర్‌ఎస్‌ పాలక వర్గాల చేతిలో 14, బీజేపీ పాలక వర్గాల చేతిలో ఐదు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రజాప్రతినిధులు జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడి రోజుకో తరహా ఆందోళన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుండగా, ప్రతిపక్ష పార్టీల నేతలు ఇందుకు దూరంగా ఉంటున్నారు. వీరంతా అంతర్గతంగా విలీనానికి తాము అనుకూలమేనని చెప్పి.. బహిర్గతంగా మాత్రం ఈ అంశంపై మౌనం వహిస్తున్నారు. అధినాయకుల అభీష్టానికి భిన్నంగా తాము మాట్లాడమని చెప్పి తప్పించుకుంటున్నారు.

అభివృద్ధికి బాటలు

ఫ్యూచర్‌ సిటీలో గ్రామాలు విలీనమైతే హైటెక్‌ సిటీ తరహాలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో భారీ ఐటీ పరిశ్రమలు, కంపెనీలు వస్తా యి. విల్లాలు నిర్మాణం కావడంతో పాటు రియల్‌ ఎస్టేట్‌, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని మండలాన్ని ఫ్యూచర్‌ సిటీలో విలీనం చేసి అభివృద్ధికి బాటలు వేయాలి.

– కడారి జంగయ్య యాదవ్‌,

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం

అన్ని గ్రామాలను విలీనం చేయాలి

మహేశ్వరం మండలంలోని మొత్తం 30 పంచాయతీలకుగాను తుమ్మ లూరు,మొహబ్బత్‌నగర్‌ను ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీలో విలీనం చేసింది. ఇంకా 28 గ్రామాలను విలీనం చేయాలని కోరాం. సర్పంచ్‌లతో తీర్మానాలు చేసివ్వాలని చెప్పడంతో కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన సర్పంచ్‌లు తీర్మానాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌లు తీర్మానాలు ఇవ్వడం లేదు.

– వత్తుల రఘుపతి,

ఫ్యూచర్‌ సిటీ జేఏసీ చైర్మన్‌, మహేశ్వరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement