యాలాల: ప్రమాదవశాత్తు ఇంట్లో స్విచ్ బోర్డుకు ఏర్పడిన నిప్పురవ్వలతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ముద్దాయిపేట గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పులవోని రాజు గౌడ్(40) కిరాణా దుకాణంతోపాటు పెట్రోల్ విక్రయిస్తుంటాడు. గురువారం రాత్రి ఇంట్లో కరెంటు బోర్డు స్విచ్ ఆన్‌చేసే క్రమంలో చెలరేగిన నిప్పురవ్వలు పెట్రోల్ డబ్బాపై పడటంతో మంటలు చెలరేగాయి. మంటల నుంచి రక్షించుకునే క్రమంలో రాజు ఒంటికి సైతం నిప్పంటుకొని తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని హుటాహుటిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతుడి మామ నరేందర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


