బషీరాబాద్: మండలంలోని నంద్యానాయక్ తండా మాజీ సర్పంచ్ రాథోడ్ శంకర్‌నాయక్ మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో హల్‌చల్ సృష్టించాడు. తనకు రావాల్సిన పాత బిల్లులను ప్రస్తుత సర్పంచ్ సుమ్మిబాయి చెల్లించడంలేదని ఆరోపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగడంతో కార్యాలయంలో ఉన్న అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎంపీడీఓ సంపత్‌కుమార్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు శంకర్‌నాయక్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా వారితోనూ వాగ్వాదానికి దిగాడు. అనంతరం కార్యాలయం వద్దే తిరుగుతూ ఉద్యోగులను బెదిరించేలా ప్రవర్తించి, ఒక్కసారిగా ఎంపీడీఓ చాంబర్ వైపు దూసుకెళ్లాడు. దీంతో ఎంపీడీఓ సంపత్‌కుమార్ కార్యాలయంపైకి పరుగులు తీశారు. మద్యం మత్తులో ఉన్న మాజీ సర్పంచ్‌పై గతంలోనూ అధికారులను బెదిరించాడు. ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్‌పై తిరుగుతున్న శంకర్‌నాయక్‌తో తమకు ప్రాణహాని ఉందని ఎంపీడీఓ, కార్యదర్శి దశరత్ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శంకర్ ప్రవర్తనతో అప్రమత్తమైన పోలీసులు అతడిని స్టేషన్‌కు తరలించారు.
భయభ్రాంతులకు గురైన అధికారులు


