సాక్షి, సిటీబ్యూరో
నగరంలోని ఓ కుటుంబ సగటు వార్షికాదాయం రూ.21.2 లక్షలు.. వ్యయం రూ.13.8 లక్షలు.. అప్పు రూ.3 లక్షలు.. ఆదాయంలో చేస్తున్న ఖర్చు 64.7 శాతం.. టాటా సంస్థ ‘ది మెనీ అర్బన్ ఇండియాస్’ పేరుతో నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఐటీ, ఔషధ, రియల్ ఎస్టేట్, సేవలు, వ్యాపార రంగాల విస్తరణతో శరవేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ ఆర్థిక బలాన్ని ఈ అధ్యయనం మరోసారి స్పష్టం చేసింది. నగర కుటుంబాలు ఎంత సంపాదిస్తున్నాయి? అందులో ఎంత ఖర్చు చేస్తున్నాయి? ఎంత పొదుపు చేస్తున్నాయి? ఎంత అప్పు తీసుకుంటున్నాయి? అనే అంశాలపై దేశ వ్యాప్తంగా ఈ అధ్యయనం జరిగింది. ఆరు ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చైన్నె, కోల్‌కతా, బెంగళూరులను ఈ అధ్యయనం పోల్చింది.
అగ్రస్థానంలో బెంగళూరు
నగరంలోని ఓ కుటుంబం సగటున ఏడాదికి రూ.21.2 లక్షల ఆదాయం ఆర్జిస్తూ ఆరు ప్రధాన నగరాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. బెంగళూరు కుటుంబాల సగటు వార్షిక ఆదాయం రూ.28.3 లక్షలతో మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ రూ.25.9 లక్షలు, ముంబై రూ.24.2 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైన్నె రూ.18.9 లక్షలు, కోల్‌కతా రూ.16.8 లక్షలతో హైదరాబాద్ కంటే వెనుక ఉన్నాయి. సగటు ఆదాయం మాత్రమే నగర ప్రజల ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి సరిపోదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఆదాయ పంపిణీని పరిశీలించినప్పుడు హైదరాబాద్ ప్రత్యేకత బయటపడుతోందని స్పష్టం చేసింది.
ఖర్చు 64.7 శాతమే..
హైదరాబాద్ కుటుంబాలు తమ ఆదాయంలో సగం కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నాయి. సగటున వార్షిక ఆదాయంలో 64.7 శాతాన్ని ఖర్చు చేస్తున్నాయి. ఒక్క కుటుంబం ఏడాదికి సగటున రూ.13.8 లక్షలు వెచ్చిస్తోంది. చైన్నెలో అత్యధికంగా 67 శాతం ఆదాయం ఖర్చవుతుండగా.. కోల్‌కతా 59.4, ముంబై 57.9, ఢిల్లీ 56.1, బెంగళూరు 54.1 % ఖర్చు అవుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తక్కువ ఆదాయం ఉన్న నగర కుటుంబాలు తప్పనిసరిగా తక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తాయని చెప్పలేకపోవడం. వినియోగ అవసరాలు, జీవనశైలి, నగరంలో వస్తువులు–సేవల ధరలు వంటి అంశాల ఆధారంగా ఖర్చు తీరులో భారీ తేడాలు ఉంటాయని ఈ అధ్యయనం సూచిస్తోంది.
ఆదాయం రూ.21 లక్షలు.. వ్యయం 13 లక్షలు
ఆహారేతర అవసరాలే అధికం
ప్రధాన నగరాల్లోని కుటుంబాలు ఆహారం, ప్రాథమిక అవసరాలకే పరిమితం కాకుండా ఇళ్లకు సంబంధించిన ఖర్చులు, ఆరోగ్యం, రవాణా, విద్య, వినోదం, అందం–వ్యక్తిగత సంరక్షణ వంటి అంశాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం వ్యయంలో ఆహారంపై 29.9 శాతం, ఆహారేతర అంశాలపై 70.1 శాతం ఖర్చవుతోంది. ఆహారేతర వ్యయంలో గృహ నిర్మాణం, సంబంధిత సౌకర్యాలు, రవాణా, విద్య, ఫ్యాషన్, ఆరోగ్యం, వినోదం, అందం–వ్యక్తిగత సంరక్షణ వంటివి ఉన్నాయి.
పొదుపు 35.3 శాతం
హైదరాబాద్ కుటుంబాలు సగటున ఆదాయంలో 35.3 శాతాన్ని పొదుపు చేస్తున్నాయి. అంటే ఒక్క కుటుంబం ఏడాదికి సగటున రూ.7.5 లక్షలు పొదుపు చేస్తోంది. బెంగళూరు కుటుంబాలు మాత్రం 45.9 శాతం పొదుపుతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఢిల్లీ 43.9, ముంబై 42.1, కోల్‌కతా 40.6 శాతాలో హైదరాబాద్ కంటే ముందున్నాయి. చైన్నె 33 శాతం పొదుపుతో హైదరాబాద్ కంటే వెనుక ఉంది. దేశంలోని 100 నగరాల్లోని కుటుంబాలు సగటున తమ ఆదాయంలో 25 శాతాన్ని పొదుపు చేస్తుండగా.. ఆరు ప్రధాన నగరాల కుటుంబాలు 42 శాతం వరకు పొదుపు చేస్తున్నాయి.
భాగ్యనగర కుటుంబాల ఆర్థిక ప్రణాళిక భేష్
వార్షికాదాయంలో దేశంలోనే 4వ స్థానం
నగరవాసి సగటు అప్పు రూ.3 లక్షలు
‘ది మెనీ అర్బన్ ఇండియా’ సర్వేలో వెల్లడి
ఆరు నగరాల్లో హైదరాబాద్ స్థానం ఇలా..
సగటు వార్షిక కుటుంబ ఆదాయం రూ.21.2 లక్షలు 4వ స్థానం
సగటు వార్షిక కుటుంబ వ్యయం రూ.13.8 లక్షలు 3వ స్థానం
ఆదాయంలో ఖర్చు వాటా 64.7 శాతం 2వ స్థానం
వార్షిక పొదుపు రూ.7.5 లక్షలు 4వ స్థానం
ఆదాయంలో పొదుపు వాటా 35.3 శాతం 4వ స్థానం
రుణ–ఆదాయ నిష్పత్తి 14 శాతం అత్యల్పం
సగటు కుటుంబ అప్పు రూ.3 లక్షలు అత్యల్పం
వినియోగ మార్కెట్ రూ.2.9 లక్షల కోట్లు 6వ స్థానం


