యాలాల: కాగ్నా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను గురువారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. తాండూరు – కొడంగల్ మార్గంలో ఇసుక లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్‌ను ఆపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని గుర్తించి వాహనాన్ని సీజ్ చేసి పీఎస్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అసభ్యకర ప్రవర్తన.. కేసు నమోదు
యాచారం: కూలీ పని ఇప్పిస్తానని చెప్పి..అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. వివరాలివీ.. నాగార్జునసాగర్ హైవేపై తుర్కయంజాల్ అడ్డాపై కూలీ పని కోసం వేచి ఉన్న ఓ మహిళను మార్బుల్ పని ఉందని నమ్మించిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం తన మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి యాచారం మండల పరిధిలోని తాడిపర్తి అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి డబ్బులిస్తానని చెప్పి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి మోటార్ సైకిల్‌పై పరారయ్యాడు. వెంటనే ఆ మహిళ 112కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. స్పందించిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు అక్కడికి వెళ్లి కుర్మిద్దలోని పీఎస్‌కు తీసుకొచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం ఉదయం కేసు నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
కుల్కచర్ల: ఉనికి కోసమే బీఆర్‌ఎస్ నాయకులు పోరాటం పేరుతో డ్రామాలు చేస్తున్నారని పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్లలో విలేకరులతో మాట్లాడారు. అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ నేతలు పోరాటాల పేరుతో బయటకు వచ్చారని అన్నారు. ఇన్ని రోజులు ప్రజలు గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు.
ఒకరి మృతి, మరొకరికి గాయాలు
ఇబ్రహీంపట్నం రూరల్: ఇనుప రాడ్లతో వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరి తీవ్ర గాయాలైన సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. ఏపీ నంద్యాల జిల్లా డోన్ మండలం దేవరబండ గ్రామానికి చెందిన కోటకొండ శివ (22), నాగేశ్వరావుతో కలిసి బొలేరో వాహనంలో గురువారం కూరగాయల లోడ్‌తో డోన్ నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు మీదుగా వరంగల్ జిల్లా పరకాల వైపు వెళ్తున్నారు. ఎగ్జిట్13 రావిర్యాల వద్దకు రాగానే ఇనుప రాడ్లతో వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న శివ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ పక్కనే ఉన్న నాగేశ్వర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శివ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పహాడీషరీఫ్: బ్లాక్ మార్కెట్‌కు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిపై పహాడీషరీఫ్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ బీఎల్‌ఎన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా అచ్చిరెడ్డినగర్ కాలనీకి చెందిన మహ్మద్ నహీద్ (30) గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం, గోధుమలను కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే రెండు పర్యాయాలు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయయి. ఇతనిపై పీడీ యాక్ట్ కోరుతూ పహాడీషరీఫ్ పోలీసులు పంపిన ప్రతిపాదనకు నగర పోలీస్ కమిషనర్ ఆమోదం తెలిపారు.
వివాహిత మృతి
తాండూరు టౌన్: పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌లో నివాసముంటున్న ఓ వివాహిత గురువారం మృతి చెందింది. సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నారాయణ్‌పేట్ జిల్లా రాయకోడ్‌కు చెందిన మమత(23)కు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ ఉప్పరి అనిల్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. గురువారం ఉదయం మృతురాలి అత్త ఎంత పిలిచినా లేవకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు తాండూరుకు చేరుకున్నారు. తన కూతురు ఎలా మృతి చెందిందో దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు.


