గుడుంబా నుంచి హవాలా వరకు | - | Sakshi
Sakshi News home page

గుడుంబా నుంచి హవాలా వరకు

Sep 4 2026 7:17 AM | Updated on Sep 4 2026 7:17 AM

సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు గుడుంబా విక్రయం.. ఆ తర్వాత గంజాయి వ్యాపారం.. మొదట చిన్న స్థాయిలో మొదలైన దందా క్రమంగా భారీ నెట్‌వర్క్‌గా మారింది. అనేక ప్రాంతాలకు విస్తరించింది. గంజాయి విక్రేతలు, వినియోగదారులకు ఆమె కేంద్రంగా మారింది. అంచెలంచెలుగా ఎదిగింది. మొదట్లో ధూల్‌పేట్‌లో కిరాణా దుకాణం ముసుగులో గంజాయి విక్రయాలను ప్రారంభించిన నీతుబాయి.. ఇప్పుడు రూ.కోట్లలో అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి డాన్‌గా మారింది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ సిబ్బందిని లక్ష్యంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. వరుసగా కేసులు నమోదైనా, పలుమార్లు అరెస్టయినా.. పీడీ యాక్ట్‌ కింద నిర్బంధించినా.. ఆమె దందా మాత్రం యథావిధిగా కొనసాగడం గమనార్హం. గంజాయి విక్రయాలతో ప్రారంభించి హవాలా వ్యాపారం దిశగా సాగింది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది.

అక్రమ వ్యాపార విస్తరణ..

నీతుబాయి స్వస్థలం ధూల్‌పేట్‌ అయినప్పటికీ, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ బాయ్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి నానక్‌రామ్‌గూడలోని లోథాబస్తీలో ఒక చిన్న కిరాణా దుకాణం ముసుగులో విక్రయాలు ప్రారంభించింది. ధూల్‌పేట్‌కు చెందిన అంగూరిబాయి (అరుణాబాయి)తో పాటు ఒడిశా, ఏపీ సరిహద్దు ప్రాంతాల ద్వారా గంజాయి దిగుమతి చేసుకునేది. కిలో గంజాయిని రూ.8వేలకు కొనుగోలు చేసి 5 గ్రాముల చిన్న పొట్లాలుగా మార్చి, ఒక్కో పొట్లాన్ని రూ.500 కి విక్రయించేది. ఈ లెక్కన కిలోపై రూ. 50 వేల వరకు నికర లాభం ఆర్జించేది. ఆమె కుటుంబం మొత్తం కూడా ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాములేననే ఎకై ్సజ్‌ అధికారులు ఆరోపిస్తున్నారు.

రోజుకు సగటున రూ.10 లక్షల విక్రయాలు

రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు అమ్మకాలు జరిగేవని ఎకై ్సజ్‌ అధికారుల దాడుల్లో తేలింది. నీతుబాయిపై 18కి పైగా ఎన్‌డీపీఎస్‌ కేసులు ఉన్నాయి. గతంలో గచ్చిబౌలి పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. 2024లో నిర్వహించిన దాడిలో 22.6 కిలోల గంజాయి, రూ.22.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నీతుబాయి నేరపూరిత సంపాదనపై ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పీఎంఎఎల్‌ఏ చట్టం కింద మనీ లాండరింగ్‌ కేసులు నమోదు చేసి, నానక్‌రామ్‌గూడలోని ఇంట్లో సోదాలు నిర్వహించింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో వేలాది మంది ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఆమె వ్యాపారాన్ని విస్తరించినట్లు ఎకై ్సజ్‌ అధికారులు తెలిపారు. ఇక్కడి నైట్‌లైఫ్‌ కూడా ఇందుకు దోహదం చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement