మిల్లర్ల మాయాజాలం! | - | Sakshi
Sakshi News home page

మిల్లర్ల మాయాజాలం!

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

సీఎంఆర్‌లో రూ.కోట్లు స్వాహా కేసులతో సరిపెడుతున్న యంత్రాంగం ఊసేలేని రికవరీ తాజాగా ఓ రైస్‌ మిల్లులో రూ.3 కోట్ల బియ్యం మాయం గతంలోనూ మూడు మిల్లుల్లో ఇదే తరహా మోసాలు రూ.40 కోట్లు బకాయి పడ్డ ఇద్దరు వ్యాపారులు

వికారాబాద్‌: ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు బియ్యంగా మార్చే ప్రక్రియలో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. మిల్లర్లకు అధికారులు, నేతలు కొమ్ము కాస్తుండటంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పో తోంది. ఏటా ఏదో ఒక మిల్లులో అక్రమాలు వెలు గు చూస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బొంరాస్‌పేట మండ లం కేతకీ సంగమేశ్వర రైస్‌ మిల్లులో రూ.3 కోట్లకు పైగా విలువ చేసే బియ్యం తిరిగి ఇవ్వడంలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం వీరికి కేటాయించిన ధాన్యం కానీ, ఆడించిన బియ్యం కానీ మిల్లులో కనిపించలేదు. సీఎంఆర్‌ను బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది కూడా ఇదే తరహాలో పలు చోట్ల అవకతవకలకు జరగ్గా అధికారులు కేసులతో సరి పెట్టారు. రికవరీ జోలికి వెళ్లలేదు. దోమ, బషీరాబాద్‌, యాలాల మండలాలల్లో కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లు మాయం చేశారు. యజమానులను రిమాండ్‌ చేసేరే తప్ప తదుపరి చర్యలు చేపట్టలేదు. దోమ మండలం మోత్కూర్‌ గేట్‌ సమీపంలోని మహాలక్ష్మి రైస్‌ మిల్లులో ఇటీవల విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. 2022 ఏడాదికి సంబంధించి ధాన్యం బకాయిలు రూ.17.5 కోట్లు నేటికీ చెల్లించలేదని తెలింది. వికారాబాద్‌ మండలం ధన్నారం సమీపంలోని ఓ రైస్‌ మిల్లు యజమానులు సైతం రూ.22.5 కోట్లు చెల్లించాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

తీవ్ర జాప్యం

ప్రభుత్వం ఏటా కొనుగోలు కేంద్రాల ద్వారా వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తోంది. వడ్లను మిల్లులకు కేటాయించి సీఎంఆర్‌ రూపంలో తిరిగి తీసు కుంటుంది. అయితే ఆడించిన బియ్యం తిరిగి ఇవ్వడంలో మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి.. దొడ్డు బియ్యాన్ని పాలిష్‌ చేసి ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని బయట రూ.2,200 నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. బహిరంగ మా ర్కెట్‌లో క్వింటాలు రూ.900 నుంచి రూ.1,200 ల కు లభించే తక్కువ రకం బియ్యాన్ని కొనుగోలు చే సి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మిల్లర్లు క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు అక్రమంగా లాభం పొందుతున్నారు. కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారు.

మిల్లర్లతో అధికారుల కుమ్మక్కు

రైస్‌ మిల్లర్లతో సివిల్‌ సప్లయ్‌ అధికారులు కుమ్మక్కు కావటంతో వారి నుంచి సీఎంఆర్‌ సకాలంలో అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. భారీ అక్రమాలు జరిగినట్లు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరి సు న్నారు. గడువులోగా సీఎంఆర్‌ సేకరించాలని ప్రభు త్వం పదే పదే చెబుతున్నా అధికారులు మా త్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో ఇచ్చిన ధాన్యం సగానికిపైగా మిల్లర్ల వద్దే ఉంది. గతంలో కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేక వడ్ల ను నేరుగా మిల్లులకు తరలించారు. ఇదే అదునుగా భావించిన మిల్లు యజమానులు రైతుల వద్ద క్వింటాలుకు 6 నుంచి 10 కిలోలు తరుగు రూపంలో కోత విధించారు. ఈ విషయమై రైతులు మిల్లుల ముందు ఆందోళన కూడా చేశారు.

నేతల చేతుల్లో మెజార్టీ మిల్లులు

జిల్లాలో ఏడు బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు.. 23 రా రైస్‌ మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం సేకరించిన వడ్లను ఈ మిల్లులకే తరలిస్తారు. మెజార్టీ మిల్లులు నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉన్నారు. ప్రస్తుతం రారైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా అధికార పార్టీ నాయకుడు ఉండగా.. బాయిల్డ్‌ మిల్లర్ల అసోసియోషన్‌ అధ్యక్షుడుగా మరో పార్టీకి చెందిన నాయకుడు ఉన్నారు. వీరు మిల్లర్లకు అండగా నిలుస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement