● యువతిపై అత్యాచారం చేసి హత్య?
● నిందితుడు బీహార్‌వాసి
పహాడీషరీఫ్: రెండు రోజుల క్రితం తుక్కుగూడలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన నర్సు కేసులో పురోగతి లభించింది. యువతిని అత్యాచారం చేసి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలివీ.. ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలం చౌదరిగూడెం గ్రామానికి చెందిన వూకే బ్రహ్మ య్య కుమార్తె శిరీష (21) ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ప్రైమ్‌కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్సుగా విధుల్లో చేరింది. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి ఆస్పత్రి ఆవరణలోని తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు కూడా నిద్ర లేవకపోవడం, ఫోన్‌లో స్పందించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది కిటికీ తెరిచి చూడగా మృతి చెంది కనిపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు ఆధారంగా అత్యాచారం, హత్య కేసుగా మార్చారు. ఆదివారం యువతి మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేశారు.
నిత్యం యువతి కదలికలపై కన్నేసి..
ఆస్పత్రిని ఆనుకొని ఉన్న కార్ల మెకానిక్ షోరూంలో బీహార్‌కు చెందిన మహ్మద్ సనుహుల్లా(34) పని చేస్తున్నాడు. షోరూంలో పనిచేసే తోటి కార్మికులు సాయంత్రం వెళ్లిపోగా, ఇతడు మాత్రం అందులోనే నిద్రించేవాడు. ఆస్పత్రిలో నర్సులుగా పనిచేస్తున్న యువతులు నిత్యం ఏ సమయానికి గదిలోకి వస్తారు.. ఎవరెవరు ఉంటారనే విషయమై చాలా రోజులుగా గమనిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి శిరీష నిద్రించాక చడీ చప్పుడు కాకుండా గది వద్దకు చేరుకొని గ్రిల్స్ లేకుండా ఉన్న కిటికీని సునాయసంగా తొలగించి లోనికి ప్రవేశించాడు. యువతిపై లైంగిక దాడికి పాల్పడుతున్న క్రమంలో ఆమె కేకలు వేసి ప్రతిఘటించడంతో బయటికి వినిపించకుండా గొంతు నులిమి హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
మార్చురీ వద్ద బీజేపీ నేతల ఆందోళన
అఫ్జల్‌గంజ్: నర్సు శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించిన విషయం తెలుసుకుని బీజేపీ నాయకులు మార్చురీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. నిందితుడిని తక్షణమే ఎన్‌కౌంటర్ చేయాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించగా సొంతూరుకు తరలించారు.


