సేంద్రియ సాగుకు ‘ఏకలవ్య’ ఊతం | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగుకు ‘ఏకలవ్య’ ఊతం

Aug 31 2026 7:58 AM | Updated on Aug 31 2026 7:58 AM

సేంద్రియ సాగుకు ‘ఏకలవ్య’ ఊతం

తాండూరు రూరల్‌: గ్రామీణ ప్రాంత రైతుల జీవనోపాధి మెరుగుదల, సేంద్రియ–సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ఫౌండేషన్‌ కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జినుగుర్తి సమీపంలోని ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ఫౌండేషన్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ యువతకు గో ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాళ్ల నేలలో రత్నాలు పండిస్తున్నారని అభినందించారు. ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు తాండూరు ప్రజల అదృష్టమని మండలి చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత్‌ కార్యకారిణి భాగయ్యజీ, జినుగుర్తి సర్పంచ్‌ శరణ్‌, ఏఎంసీ చైర్మన్‌ వడ్డె శ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌, నాయకులు ఉత్తమ్‌చందు, రవిగౌడ్‌, రాంలింగారెడ్డి, లొంక నర్సింలు పాల్గొన్నారు. ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ఫౌండేషన్‌లో కొనసాగుతున్న సాందీపని గురుకుల పాఠశాల విద్యార్థులు మల్లఖంబ్‌ విన్యాసం అతిథులను ఆకట్టుకుంది.

నాపరాతి పరిశ్రమలకు రక్షణ కల్పించండి

తాండూరు ప్రాంతంలోని నాపరాతి పరిశ్రమలకు రక్షణ కల్పించాలని నాపరాతి వ్యాపారులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ఫౌండేషన్‌కు విచ్చేసిన కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి వారు వినతిపత్రం సమర్పించారు. నాపరాతి పరిశ్రమలు దెబ్బతింటే వ్యాపారులు నష్టపోవడంతో పాటు వేలాది మంది కార్మికుల జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

సీసీఐ ఫ్యాక్టరీకి బొగ్గు సరఫరా చేయండి

తాండూరు మండలంలోని కరన్‌కోట్‌ సమీపంలోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)ఫ్యాక్టరీకి సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీసీఐకి ట్రేడ్‌ యూనియన్‌ ప్రతినిధులు కోరారు. ప్రతీ నెల 4 రేక్‌ల(16 వేల మెట్రిక్‌ టన్నుల) బొగ్గు అవసరం ఉండగా.. ప్రస్తుతం ఒక రేక్‌(4 వేల మెట్రిక్‌ టన్నుల) మాత్రమే సరఫరా అవుతోందన్నారు. నెలకు 60 వేల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తికి గాను 12 వేల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ మాత్రమే ఉత్పత్తి అవుతుందని చెప్పారు. బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement