పరిగి: అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కును కేంద్ర ప్రభుత్వం జీరో చేస్తోందని బహుజన ముక్తి పార్టీ(బీఎంపీ)జాతీయ అధ్యక్షుడు మన్యావర్ దాస్‌రాంనాయక్ అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలో బీఎంపీ జిల్లా అధ్యక్షుడు గట్యానాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలను నిర్వహించారు. ఈ మహాసభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు హాజరై మాట్లాడుతూ.. ఈవీఎంలను తీసుకువచ్చిన కాంగ్రెస్ నోరు మెదపడం లేదని మండి పడ్డారు. బీజేపీ దేశ సంపదను దోచుకుంటున్నా ప్రతిపక్ష కాంగ్రెస్ కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు హక్కును జీరో చేసేందుకు పెద్దకుట్ర జరుగుతోందని ఈవీఎం బ్యాన్ చేసి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2026లో జరిగిన జనగణనలో ఓబీసీలను లెక్కించకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. 2027లో చేపట్టే జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని డిమాండ్ చేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగితే బహుజన రాజ్యం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గట్యానాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు సాగు చేస్తున్న లావని, పోడు భూములకు పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎంఎస్‌పీ చట్టం తీసుకువచ్చి రైతులే గిట్టుబాటు ధర నిర్ణయించేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల పక్షాన బీఎంపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యత్రి రత్న, ఉపాధ్యక్షుడు ముఫ్తి మహమ్మద్ ఫైమొద్దీన్, రాష్ట్ర కార్యనిర్వహాక అధ్యక్షుడు ధర్మయ్య, కోళ్ల జనార్ధన్, హరినాయక్, గోవింద్‌నాయక్, కొర్ర పాండునాయక్, రవీందర్, చెర్క సత్తయ్య, లక్ష్మణ్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంలతో ఓటు హక్కును జీరో చేస్తున్న కేంద్రం
బీఎంపీ జాతీయ అధ్యక్షుడు మన్యావర్ దాస్‌రాంనాయక్


