కమీషన్ల కక్కుర్తి..
వికారాబాద్: ఆర్భాటంగా ప్రారంభమైన రోడ్ల అభివృద్ధి పనులు ఆరు నెలలకే ఆగిపోయాయి. విమర్శలు.. పేపర్లలో వార్తలు ప్రచురించిన సమయంలో పనులు ప్రారంభించినట్టు చేస్తున్న కాంట్రాక్టర్లు ఆ వెంటనే నిలిపేస్తున్నారు. జాతీయ స్థాయి ప్రమాణాలతో టెండర్లు దక్కించుకుని పనులు నిలిపివేయడంతో అనుమానాలకు తావిస్తోంది. ఏడాది క్రితం వికారాబాద్–పరిగి, పరిగి–షాద్‌నగర్, గడిసింగాపూర్–రెడ్డిపల్లి, వికారాబాద్–తాండూరు రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఇందులో వికారాబాద్–పరిగికి రూ.వంద కోట్లతో నాలుగు వరుసలు, పరిగి–షాద్‌నగర్ రోడ్డు సైతం లాల్‌పహాడ్ వరకు మొదటి విడతలో రూ. వంద కోట్లతో నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. పరిగి మండలం గడిసింగాపూర్ నుంచి గండీడ్ మండలం రెడ్డిపల్లి వరకు సైతం రూ.వంద కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నారు. ముందుగా పరిగి–వికారాబాద్, పరిగి–షాద్‌నగర్ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించి మూడు నెలల పాటు పనులు పరుగెత్తించారు. గడిచిన ఆరు నెలలుగా నిలిపి వేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ రోడ్లు పలువురు ప్రయాణికులను బలి తీసుకోగా అనేక మందిని క్షతగాత్రులను చేసింది.
‘మెగా’కమీషన్లే కారణమంటూ ప్రచారం
కొడంగల్ నియోజకవర్గంలో శరవేగంగా కొనసాగుతున్న పనులు వికారాబాద్, పరిగి నియోకవర్గాల్లో నెమ్మదించాయి. పలుచోట్ల పూర్తిగా నిలిచిపోయాయి. ఒకచోట పెద్ద వంతెన మాత్రమే పనులు జరుగుతుండగా రోడ్ల పనులు నిలిచిపోయాయి. అప్పుడప్పుడు రెండు టిప్పర్ల కంకర పోయడం, ఓ టిప్పర్‌ను తిప్పుతూ పనులు చేపడుతున్నట్లు చేస్తున్నారే తప్ప ఎక్కడా ముందుకు సాగడంలేదు. రూ.వందల కోట్లతో టెండర్లు దక్కించుకున్న మెగా సంస్థ సబ్ కాంట్రాక్టు ఇచ్చి పనులు చేపడుతున్నట్టు సమాచారం. జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ కాంట్రాక్టర్‌కు నేతల మధ్య తలెత్తన వివాదాల కారణంగా పనులు నిలిచిపోయాయనే ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్ దగ్గర పెద్దమొత్తంలో కమీషన్ డిమాండ్ చేయడం వల్లే పనులు నిలిపేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పనులు నిలిచిపోయినా నేతలు నోరు మెదపకపోవటం, పనులను పర్యవేక్షించకపోవడం విమర్శలకు బలం చేకూరుస్తోంది.
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం
రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు నిబందనలు పాటించడం లేదు. బ్రిడ్జిలు నిర్మించే చోట సూచిక బోర్డుల ఏర్పాటు సక్రమంగా ఉండడం లేదు. రాత్రి సమయాల్లో ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు రేడియం స్టిక్కర్లు వేయడం లేదు. డైవర్షన్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దుమ్ము లేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. పరిగి–షాద్‌నగర్ మార్గంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గుంతలో పడి ఓ ద్విచక్రవాహనదారుడు, యాలాల మండల పరిధిలో మరో ద్విచక్రవాహనదారుడు మృతి చెందారు. పరిగి–వికారాబాద్ రోడ్డు సైతం ఇటీవల ఓ ప్రయాణికుడిని బలితీసుకుంది. కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధుల అండతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా వారిని ఏమి చేయలేక అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. నాణ్యత విషయంలో నోరు మెదపని ప్రజాప్రతినిధులు ప్రజల ప్రాణాల విషయంలోనైనా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
అర్ధాంతరంగా నిలిచిన రోడ్డు నిర్మాణ పనులు
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న రహదారులు
నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లు
అనుమానాలకు తావిస్తున్న నేతల మౌనం


