తెలంగాణపై ఎగిరేది కాషాయ జెండానే.. | - | Sakshi
Sakshi News home page

తెలంగాణపై ఎగిరేది కాషాయ జెండానే..

Aug 31 2026 7:58 AM | Updated on Aug 31 2026 7:58 AM

తాండూరు టౌన్‌: అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణపై ఎగిరేది బీజేపీ జెండాయేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖామంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని వీరశైవ కల్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌కుమార్‌ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కమీషన్ల కోసమే ఆరాటపడుతోందని ఆరోపించారు. ఒకప్పుడు మిగులు నిధుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ప్రస్తుతం రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అవినీతి పార్టీలేనన్నారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని రాహుల్‌గాంధీ గొంతు చించుకుంటున్నాడని.. కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి తేవడం, సర్జికల్‌ స్ట్రైక్‌, ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌ వెన్నువిరవడం, సబ్సిడీ ఎరువులు ఇచ్చి రైతులను ఆదుకోవడం, త్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసి ముస్లిం మహిళల ఆదరాభిమానాలు పొందడం, ప్రతీ పేదోడికి రేషన్‌ బియ్యం ఇవ్వడం వంటి మంచి పనులు చేసినందుకు మోడీ రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. బోఫోర్స్‌, బొగ్గు వంటి పలు కుంభకోణాల్లో మునిగి తేలిన కాంగ్రెస్‌.. ఎలాంటి అవినీతి మరక లేని మోదీని రాజీనామా చేయమనడం హాస్యాస్పదమన్నారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నేడు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతోందన్నారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, నేషనల్‌ హైవేల నిర్మాణం వంటివి శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఈసందర్భంగా జిల్లా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన రమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌతం రావు, గువ్వల బాలరాజు, ప్రహ్లాద్‌ రావు, కెఎస్‌ రత్నం తదితరులు పాల్గొన్నారు.

టెట్‌ నుంచి మినహాయింపునకు వినతి

2010వ సంవత్సరం కంటే ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం సభ్యులు (తపస్‌) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 2010 ఆగస్టు 23న ఎన్‌సీటీఈ(నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌) జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ను అర్హతగా నిర్ణయించారని.. అంతకు ముందే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారికి వర్తించదన్నారు. వారికి టెట్‌ నుంచి మినహాయిస్తూ ఉద్యోగ భద్రత, సీనియారిటీ, పదోన్నతులు, వేతన, పెన్షన్‌ ఇతర సేవా ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుని న్యాయం చేయాలని తపస్‌ జిల్లా శాఖ సభ్యులు కోరారు.

మన్నెగూడలో స్వాగతం

పూడూరు: తాండూరులో ఏకలవ్య ఫౌండేషన్‌కు వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మన్నెగూడ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలతో సన్మించారు. స్వాగతం పలికిన వారిలో బీజేపీ పరిగి ఇన్‌చార్జి బూనేటి మారుతికిరణ్‌, సినిమా సెన్సార్‌బోర్డు సభ్యుడు మల్లేశ్‌పటేల్‌, వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్‌, జిల్లా ఐటీ ఇన్‌చార్జి రవీందర్‌, జిల్లా నాయకులు శరత్‌కుమార్‌రెడ్డి, కేశవులు, వెంకటయ్య, యూసుఫ్‌ఖాన్‌ తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్‌ది కమీషన్‌.. బీఆర్‌ఎస్‌ దోపిడీ పాలన

కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి కిషన్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement