విద్యుదాఘాతంతో గేదె మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో గేదె మృతి

Aug 31 2026 7:46 AM | Updated on Aug 31 2026 7:46 AM

విద్యుదాఘాతంతో గేదె మృతి ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

యాలాల: విద్యుదాఘాతంతో ఓ గేదె మృత్యువాత పడింది. ఈ ఘటన మండల పరిధిలోని బెన్నూరులో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గాళ్ల కృష్ణయ్య గేదె మేత మేస్తూ కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ కంచె ఏర్పాటు చేస్తే ప్రమాదం జరిగేది కాదని.. గేదె విలువ రూ.లక్ష ఉంటుందని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

బొంరెడ్డిపల్లిలో..

కుల్కచర్ల: మండల పరిధిలోని బొంరెడ్డిపల్లిలో విద్యుదాఘాతంతో మృత్యువాతపడింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని రాములు గేదె మేత మేస్తుండగా విద్యుత్‌ వైర్‌ తగిలి విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. గేదె విలువు సూమారు రూ.80వేలు ఉంటుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరారు.

అనంతగిరి: ఉరేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్‌ పట్టణంలోని రామయ్యగూడ అంబేడ్కర్‌ నగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ రఘుకుమార్‌ తెలిపిన ప్రకారం.. పట్టణానికి చెందిన కొండపల్లి సంజయ్‌(17) తండ్రి మృతి చెందగా తల్లి సరస్వతితో కలిసి ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లి స్థానికుల సహాయంతో పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆతహత్యకు కారణాలు తెలియరాలేదని.. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి

మృతదేహం లభ్యం

పహాడీషరీఫ్‌: చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్‌ చెరువులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించి మూడు రోజుల క్రితం చెరువులో పడి ఉంటాడని భావిస్తున్నారు. 30–40 ఏళ్ల వయసు ఉంటుందని, అతని చొక్కాను షాద్‌నగర్‌లో కుట్టించినట్లు టైలర్‌ మార్క్‌ ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మట్టి తరలిస్తున్న టిప్పర్లు స్వాధీనం

కేశంపేట: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామ శివారు నుంచి టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీస్‌ సిబ్బంది కిరణ్‌కుమార్‌, శివుడు మట్టిలోడ్‌తో వెళ్తున్న టిప్పర్లను గుర్తించారు. వాటిని ఆపి అనుమతులు ఉన్నాయా అని డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. అనుమతులు లేకుండా తరలిస్తున్నట్టు గుర్తించి టిప్పర్లను శనివారం రాత్రి స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెట్రోలింగ్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు టిప్పర్‌ డ్రైవర్లతో పాటు వాహన యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

ఇబ్రహీంపట్నం రూరల్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్‌ కథనం ప్రకారం.. తాళ్లపల్లి కరుణాకర్‌ (38) అనే వ్యక్తి నాలుగేళ్లుగా రావిర్యాల సమీపంలోని ఓ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో పని చేస్తున్నాడు. రోజులాగే శనివారం ఉదయం బైక్‌పై డ్యూటీకి వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తూ తుక్కుగూడ సమీపంలో ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో ఉన్న ఏషియన్‌ పెయింట్స్‌ దగ్గర నిలిపి ఉన్న బొలేరా వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కరుణాకర్‌ తలకు బలమైన గాయం కావడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. భార్య దీపిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement