నేడు పెంజర్లకు అదనపు కలెక్టర్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు పెంజర్లకు అదనపు కలెక్టర్‌ రాక

Aug 29 2026 7:15 AM | Updated on Aug 29 2026 7:15 AM

సీఎం ప్రజావాణికి 42 వినతిపత్రాలు రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్‌ మృతి

కొత్తూర్‌: మండలంలోని పెంజర్ల పంచాయతీకి శనివారం అదనపు కలెక్టర్‌ కిరణ్మయి రానున్నట్లు ఎంపీడీఓ అరుంధతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, హెల్త్‌సెంటర్‌, ప్రభుత్వ కార్యాలయాలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు.

ఏఐటీయూసీ మహాసభల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

చేవెళ్ల: కరీంనగర్‌లో వచ్చే నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి పిలుపునిచ్చారు. పట్టణ కేంద్రంలో శుక్రవారం మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభల్లో కార్మికులు, ఉద్యోగులు, ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి భవిష్యత్తు కార్మిక ఉద్యమానికి కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలిరావాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులు లక్షలాది మంది ఉన్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాబోయే కాలంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలి పారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఎం.సత్తిరెడ్డి, ఎం.సుధాకర్‌గౌడ్‌, మక్బుల్‌, బాబురావు, శ్రీను, హనుమంత్‌, శంకర్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

అనుమతులు లేని రోడ్డు నిర్మాణాల కూల్చివేత

మహేశ్వరం: ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన రోడ్డు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. మండల పరిధిలోని కొంగర ఖుర్దు–ఎ రెవెన్యూ సర్వే నంబర్‌ 298లోని ప్రభుత్వ పక్కనే ఆక్రమణదారులు కొంత భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వ భూమి నుంచి తప్పుడు కోర్టు ఆర్డర్లు చూపిస్తూ రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామస్తులు, రైతులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో శుక్రవారం తహసీల్దార్‌ చిన్న అప్పల నాయుడు పోలీసుల సహకారంతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన రోడ్డును జేసీబీలతో ధ్వంసం చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజిరెడ్డి, జీపీఓ అరుణ్‌, ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.

లక్డికాపూల్‌ : మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌ లో శుక్రవారం నిర్వహించిన 251వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 42 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ శాఖకు 11, మున్సిపల్‌ శాఖకు 13, విద్యుత్‌ శాఖకు 5, ఇతర శాఖలకు 13 దరఖాస్తులు అందాయి. రాఖీ పండుగ నేపథ్యంలో సీఎం ప్రజావాణికి దరఖాస్తుదారుల రద్దీ తగ్గింది.

డివైడర్‌ మధ్యలో ఉన్న కుండీని ఢీకొని ఎగిరిపడ్డ అనంతరం ఢీకొట్టిన కారు

మణికొండ: రోజువారీ విధుల్లో భాగంగా డెలివరీ ఇచ్చేందుకు వెళ్తున్న డెలివరీ బాయ్‌ బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొని తీవ్ర గాయాలతో మృతి చెందాడు.నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండకు చెందిన సయ్యద్‌ సమద్‌(32) తన రోజువారీ విధుల్లో భాగంగా శుక్రవారం నార్సింగిలోని ఫస్ట్‌ క్లబ్‌ గ్రోసరీ స్టోర్‌నుంచి గండిపేటలోని వినియోగదారునికి సరుకులు ఇచ్చేందుకు బైక్‌పై వెళ్తున్నాడు. నార్సింగిలోని ఫ్లై ఓవర్‌పై వాహనం అదుపుతప్పడంతో రోడ్డు మధ్యలో ఉన్న చెట్టు కుండీని బలంగా ఢీ కొట్టి అటువైపు రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో గండిపేట నుంచి నార్సింగి వైపు వస్తున్న టాటా ఈవీ కారు అతన్ని ఢీ కొంది. దాంతో తలకు, శరీరంలో పలు భాగాల్లో గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. విషయం తెలుసుకున్న అన్న సయ్యద్‌ సాదత్‌ సంఘటనా స్థలానికి వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న సయ్యద్‌ సమద్‌ను లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆసుపత్రికి తరలించారు.వైద్యులు పరిశీలించి అతను అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి గల కారణం, సీసీ కెమెరాల ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement