అంతా.. అస్పష్టత | - | Sakshi
Sakshi News home page

అంతా.. అస్పష్టత

Aug 29 2026 7:15 AM | Updated on Aug 29 2026 7:15 AM

సాక్షి, సిటీబ్యూరో: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో భాగంగా జారీ చేస్తున్న నోటీసులు నగరంలో కొత్త ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఎన్యూమరేషన్‌ ఫారాన్ని అన్ని వివరాలతో భర్తీ చేసినా నోటీసులు రావడంతో చాలామంది అయోమయానికి గురవుతున్నారు. నో మ్యాపింగ్‌, అనామలిస్‌ కారణంగా జీహెచ్‌ఎంసీలో ఈ కేటగిరీల్లోని వారు దాదాపు 12.55 లక్షల మంది ఓటర్లున్నారు. వీరందరికీ ఇప్పటికే నోటీసులు అందాలి. కానీ.. దాదాపు లక్ష మందికి మాత్రమే అందాయి. అందరికీ అందేందుకు ఇంకెన్ని రోజులు పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమే కాలేదు..

షెడ్యూలు మేరకు శుక్రవారానికే నోటీసుల పంపిణీ పూర్తి కావాల్సి ఉండగా, కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ప్రారంభమే కాలేదు. సెప్టెంబర్‌ 16 వరకు అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉండగా, చాలామందికి ఎన్నో అనుమానాలున్నాయి. వీటికి సంబంధించి ప్రజలకు తగిన సమాచారం అందించడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో వార్డు సభలు నిర్వహించినప్పటికీ, ప్రజలకు ఆ విషయం తెలియదు. దీంతో, నోటీసుల జారీ నుంచి వాటి పంపిణీ, ఆ తర్వాత వివరణ తీసుకునే వరకు ప్రతి దశలోనూ స్పష్టత లోపిస్తోందని పలువురు ఓటర్లు చెబుతున్నారు. స్వల్ప దోషాలున్నవారికి నోటీసులివ్వొద్దని, వాటిని సంబంధిత అధికారులే సరిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించినా పట్టించుకున్న దాఖలాల్లేవు.

చిన్నపాటి అక్షర దోషమున్నా..

ఓటరు పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు లేదా చిరునామాలో చిన్నపాటి తప్పులున్నా, ఒక్క అక్షర దోషమున్నా, అధికారుల ముందు విచారణకు నిర్ణీత తేదీన హాజరు కావాలనడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతమాత్రం దానికి కొత్తగా నమోదు చేసుకుంటే సరిపోతుందిగా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ఇటు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అటు రాజకీయ పార్టీలు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు, 2002 నాటి జాబితాతో మ్యాపింగ్‌ కాకపోతే ఏ ఆధారం చూపాలి? కుటుంబ సంబంధాల్లో వ్యత్యాసం ఉంటే ఏ పత్రం సమర్పించాలి? వంటి ప్రశ్నలకు క్షేత్రస్థాయిలో ఒకే విధమైన సమాధానం లభించడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. నోటీసుల పంపిణీలో బీఎల్‌ఓల పాత్ర కీలకం. చాలా ప్రాంతాల్లో ఇంకా పంపిణీ ప్రారంభం కాకున్నా, ఇంటికి రాకుండానే సమాచారం ఇచ్చినట్లు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో నోటీసులు ఉండటంతో బీఎల్‌ఓలపై పని ఒత్తిడి ఉండగా, పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం పట్టించుకోవడం లేరనే ఆరోపణలున్నాయి.

తప్పెవరిది?

ఎన్యూమరేషన్‌ ఫారంలో తాము అన్ని వివరాలు సక్రమంగానే భర్తీ చేసినా, సంబంధిత యాప్‌లో వివరాల నమోదు సందర్భంగా తప్పులు దొర్లితే అందుకు బాధ్యులెవరు? అనే ప్రశ్న వెలువడుతోంది. తప్పు డేటాలో ఉంటే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది? ఓటరే మళ్లీ ఆధారాలు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఓటరుకు సమాధానం, తగిన సమయం ఇవ్వాలని, అవసరమైన పత్రాలపై స్పష్టత కల్పించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

సర్‌ నోటీసులతో

ఆద్యంతం అయోమయం

జారీ నుంచి వివరణ వరకూ గందరగోళం

నగరంలో సామాన్య ఓటరుకు తప్పనితిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement