అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని కొత్తగడిలో అర్ధరాత్రి రెండు బైక్‌లను దొంగలించి తీసుకెళ్తున్న ఇద్దరు దొంగలను స్థానిక యువకులు సుమారు 15కిలో మీటర్లు వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన యువకులు నగరంలోని మియాపూర్ ప్రాంత వాసులుగా చెబుతున్నారు. వీరితో పాటు మరో ముగురు ఉన్నారని తెలిపారు. ఎంతమంది ఉన్నారు.. ఎన్ని బైకులు దొంగతనం చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. దొంగలను స్థానిక పీఎస్‌లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇనుప రాడ్లు పడి వ్యక్తి మృతి
కొడంగల్ రూరల్: హిటాచీ సాయంతో తరలిస్తున్న ఇనుప రాడ్లు ప్రమాదవశాత్తు వ్యక్తిపై పడటంతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం మున్సిపల్ పరిధిలోని బూల్కాపూర్ డంపింగ్ యార్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఎస్‌వీకే కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నర్సింలు(47) హిటాచీ సాయంతో ఇనుప రాడ్లను పనులు జరుగుతున్న ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాడ్లకు కట్టిన బెల్టు తెగిపోవడంతో అవి నర్సింలుపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రెండేళ్ల క్రితం చనిపోయింది. నర్సింలుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి తమ్ముడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ యాదయ్యగౌడ్ తెలిపారు.
ఇబ్రహీంపట్నం రూరల్: సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయం గర్భగుడి ముందున్న హుండీని గుర్తు తెలియని దుండగు చోరీ చేశారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. రోజులాగే ఈ నెల 26న రాత్రి 8 గంటల సమయంలో గర్భగుడి తలుపులు మూసివేశారు. వాచ్‌మెన్ అక్కడే నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు వచ్చి చూడగా తలుపులకు వేసిన గొలుసు తెగిపోయి ఉండటంతో పాటు ఆల యంలోని హుండీ కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
పహాడీషరీఫ్: చెరువులో దూకిన యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్‌లోని సుద్దమోని కుంటలో గురువారం మధ్యాహ్నం యువకుడు దూకాడన్న సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. మృతుడిని టోలిచౌకీ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్ (35)గా గుర్తించారు. కొత్తపేటలో ఉండే సోదరి ఇంటికి వచ్చి గురువారం భార్యకు ఫోన్ చేసి తాను చెరువులో దూకి చనిపోతున్నానని వీడియో కాల్ చేసినట్లు తేల్చారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: పని కోసం ఇంట్లో నుంచి వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. ఆదిభట్లకు చెందిన సిరిగద్దె రాజమణి (64) ఈ నెల 10న ఉదయం వ్యవసాయ పనుల కోసం వెళ్లి తిరిగి రాలేదు. గతంలోనూ ఎక్కడికో వెళ్లి వచ్చింది. అలాగే వస్తుందని కుటుంబ సభ్యులు వదిలేశారు. పదిహేను రోజులు దాటినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


