మహేశ్వరం: మండలంలోని గ్రామాలను భారత్ ఫ్యూచర్ సిటీలో విలీనం కాకుండా బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ వత్తుల రఘుపతి మండిపడ్డారు. మండల కేంద్రంలోని కర్నాటి మనోహర్ కాంప్లెక్స్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో మండలంలోని 28 పంచాయతీలను విలీనం చేయాలని కోరారు. మొత్తం 30 పంచాయతీలకుగాను తుమ్మలూరు, మొహబ్బత్‌నగర్ మాత్రమే విలీనం అయ్యాయని, ఇంకా 28 గ్రామాలు మిగిలాయన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సుమారు 14 మంది సర్పంచ్‌లతో తీర్మానాలు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలో విలీనమైతే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. సర్పంచ్‌ల తీరుకు నిరసనగా ఈ నెల 31 నుంచి రెండు రోజులపాటు రిలే దీక్షలు చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ జేఏసీ అధ్యక్షుడు కర్నాటి మనోహర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వట్టెల మల్లేష్ యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు కడారి జంగయ్య యాదవ్, సీపీఐ జిల్లా నాయకుడు దత్తు నాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పోతర్ల సుదర్శన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


