ఎక్కడికి వెళ్లినా ఇదే తంతు
ఇబ్బంది లేకుండా చూడాలి
చేవెళ్ల: ప్రభుత్వ సేవలను సులభతరం చేసేందుకు తెచ్చిన డిజిటల్ విధానాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ–కేవైసీ పేరుతో వివిధ సేవలకు పదేపదే వివరాలు సమర్పించాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ సరుకులు, బ్యాంకు సేవలు, రైతు సంక్షేమ పథకాలు, ఎరువుల కొనుగోలు, గ్యాస్ కనెక్షన్, విద్యార్థుల స్కాలర్‌షిప్ ఇలా అనేక సేవలకు గుర్తింపు ధ్రువీకరణ అవసరం కావడంతో సామాన్యులు కార్యాలయాల, బ్యాంకులు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అక్రమాలను అరికట్టడంతోపాటు అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనాలు అందించేందుకు గుర్తింపు ధ్రువీకరణ అవసరమని అధికారులు చెబుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న ప్రతి సేవకు భారంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ–కేవైసీ అంటే..
ఈ–కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్. ఆ వ్యక్తి ఎవరు.. ఆయనకు సంబంధించిన గుర్తిపు.. చిరునామా తదితర వివరాలు సరైనవేనా అనే విషయాలను ఎలక్ట్రానిక్ విధానంలో ధ్రువీకరించే ప్రక్రియ.
ఆధార్ ఉన్నా ఎందుకు..
ఆధార్ కార్డులో పూర్తి వివరాలు ఉండగా ప్రతీ సేవకు ఈ–కేవైసీ ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకసారి ధ్రువీకరణ చేస్తే డిజిటల్ వ్యవస్థ ద్వారా అన్ని సంస్థలు, శాఖలు ఉపయోగించుకునేలా చేస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. సాంతికేతకత ఉపయోగపడాలే కానీ కొత్త చిక్కులు తెచ్చిపెట్టకూడదంటున్నారు. పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగడం వ్యయప్రయాసే అవుతుందంటున్నారు.
అవగాహన కరువు
ఈ–కేవైసీ చేయించుకోవాలంటే ఎంతో కొంత చైతన్యం, విద్య, స్మార్టు ఫోన్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు దీనిపై సరైన అవగాహన లేదు. వృద్ధులకు బయోమెట్రిక్ రాకపోవడం మరో సమస్యగా మారుతోంది. వేలి ముద్రలు సరిగా రాకపోవడం, ఫోన్‌లు లేకపోవడం, మొబైల్‌కు ఓటీపీ రాకపోవడం, సర్వర్ సమస్యలతో సతమతమవుతున్నారు.
చివరి తేదీల పేరుతో ఒత్తిడి
ఈ–కేవైసీకి చివరి తేదీ ఉందంటూ చెబుతుండడం కూడా సమస్యగా మారుతోంది. గడువు సమీపించినప్పుడు ఒకసారిగా ఆయా కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. కేవైసీ లేకపోతే గ్యాస్ రాదు, రేషన్ సరుకులు ఇవ్వరు, ఎరువులు తీసుకునేందుకు రాదు, రైతు భరోసా రాదు, అనే నిబంధనలతో ఒత్తిడి పెంచుతున్నారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం చేయాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది.
రేషన్ నుంచి బ్యాంకుల దాకా ప్రతిదానికి లింకు
ప్రతీ సేవకు ఈ–కేవైసీ ఉందా అన్న ప్రశ్నలు
ఎక్కడికి వెళ్లినా ఎదురవుతున్న ఇబ్బందులు
పూర్తి చేయకుంటే ప్రయోజనాలు దక్కవనే ఆందోళన
కార్యాలయాల చుట్టూ ప్రజల ప్రదక్షిణలు
వ్యయప్రయాసలు తప్పడం లేదని అసహనం
బ్యాంకుకు వెళ్లినా, రేషన్ దుకాణం, గ్యాస్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఈ–కేవైసీ ఉందా అంటున్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు చేయిస్తున్నాం. ఎప్పుడు ఎక్కడ చేయిస్తున్నామో తెలియడం లేదు. ఏదైనా అత్యవసర సేవకోసం వవెళ్తేనే ఇది బయట పడుతోంది. దీంతో ఇబ్బందిగా మారుతోంది. ఆధార్ ద్వారా అన్ని సేవలకు ఒకే ఈ–కేవైసీ ఉంటే బాగుంటుంది.
– గోవర్థన్‌రెడ్డి, ఇబ్రహీంపల్లివార్డు, చేవెళ్ల
ఎరువుకోసం వెళ్తే ఫోన్‌లో యాప్, ఈ–కేవైసీ, ఫార్మర్ రిజిస్ట్రీ ఇలా ఎన్నో అడుగుతున్నారు. పొలానికి ఎరువుకోసం వెళ్తే ఇవన్నీ కావాలంటే చదువురాని, ఏమీ తెలియని మేము ఎక్కడికి వెళ్లాలి. ఏది చెబితే అది చెస్తూనే ఉన్నాం. మళ్లీమళ్లీ ఏదో ఒక మెలిక పెడుతూనే ఉన్నారు. ఇలా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఆలోచన చేయాలి.
– కృష్ణ, రైతు, చేవెళ్ల


