తాండూరు రూరల్: పట్టణ శివారులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ కథనం ప్రకారం.. మోమిన్‌పేట్‌కు చెందిన సాంద్ర అక్షిత్ బుధవారం రాత్రి పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేశాడు. గురువారం ఉదయం 7గంటల తర్వాత కనిపించలేదు. హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు హాస్టల్‌కు చేరుకున్న సిబ్బందితో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
నిశ్చితార్థం రద్దయిందని యువతి ఆత్మహత్య
రాజేంద్రనగర్: నిశ్చితార్థం రద్దుకావడంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ తెలిపిన మేరకు.. వికారాబాద్‌కు చెందిన సంగీత (20) రెండేళ్ళక్రితం నగరానికి వచ్చి బండ్లగూడలోని ఎన్‌ఎఫ్‌సి కాలనీలో నివాసం ఉంటోంది. 5 నెలల క్రితం నగరానికి చెందిన యువకునితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఇటీవల నిశ్చితార్థం రద్దయింది. దీంతో మునస్థాపానికి గురైన యువతి బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేశారు.
మెరుగైన పరిహారం
అందేలా చూడండి
యాచారం: శివన్నగూడెం ప్రాజెక్టు కింద వ్యవసాయ భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.60 లక్షలకు పైగా పరిహారం అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మంతన్‌గౌరెల్లి రైతులు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ కొర్ర అరవింద్‌నాయక్ ఆధ్వర్యంలో గురువారం గ్రామ రైతులు తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. శివన్నగూడెం రిజర్వాయర్ కింద శ్రీమంతగూడ రెవెన్యూ పరిధిలోని 120 ఎకరాలకు పైగా మంతన్‌గౌరెల్లి రైతుల వ్యవసాయ భూములు పోతున్నాయని తెలిపారు. గతంలో ఎకరాకు రూ.28 లక్షల పరిహారం చెల్లిస్తామని చెప్పారని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో వ్యవసాయ భూములు ఎకరాకు రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షలకు పైగా డిమాండ్ ఉందన్నారు. భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.60 లక్షలకు పైగా పరిహారం చెల్లించేలా, ఎకరాకు 121 గజాల ప్లాటు దక్కేలా చూడాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.


