శంకర్‌పల్లి: పాతకక్షల కారణంగా అన్న తన తమ్ముడిపై కొడవలితో దాడి చేశాడు. ఈ సంఘటన మోకిల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇరుకుంట తాండకి చెందిన విస్లావత్ శంకర్, రవి అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా భూ వివాదాలు కొనసాగుతున్నాయి. బుధవారం పొలం వద్ద పనులు చేసుకుంటున్న రవిపై అన్న శంకర్ కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో రవి భుజానికి బలమైన గాయం కాగా.. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం శంకర్‌ని అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జిల్లా జైలుకి తరలించారు.
చెరువులో దూకిన
యువకుడు !
గాలిస్తున్న డీఆర్‌ఎఫ్ బృందం
పహడీషరీఫ్: ఓ యువకుడు చెరువులో దూకిన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాన్ని రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం 3.30 నుంచి గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం విస్తృత్తంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సోషల్ మీడియాలో గల్లంతైన యువకుడు టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ (35) సివిల్ ఇంజనీర్ అని వైరల్ అవుతోంది. అసలు ఆ యువకుడు చెరువులో దూకాడా.. లేదా అని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపారు.
108 అంబులెన్స్‌లో ప్రసవం
మహేశ్వరం: ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించింది. మండల పరిధిలోని కేసీ తండాకు చెందిన రాహుల్–రీతు దంపతులు. రీతుకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గురువారం ఉదయం మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గ మధ్యలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో అంబులెన్స్‌లోనే సాధరణ డెలివరీ చేసిన అంబులెన్స్ సిబ్బందిని మహిళ బంధువులు అభినందించారు.
ఇంటిని కబ్జా చేశారంటూ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి
మీర్‌పేట: తన ఇంటిని కబ్జా చేశారని.. న్యాయం చేయాలని కోరుతూ ఓ వ్యక్తి నీటిట్యాంక్ (మిషన్ భగీరథ) ఎక్కిన సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. లెనిన్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌నాయక్, తిరుపతినాయక్ బంధువులు. వీరిమధ్య కొన్నేళ్లుగా ఇంటి విషయమై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో 2021లో తిరుపతినాయక్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని తనను ఇల్లు ఖాళీ చేయించారని, ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమని గురువారం సాయంత్రం శ్రీకాంత్ నీటిట్యాంక్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక నాయకులు అక్కడికి చేరుకుని సముదాయించి కిందికి దించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇంటి విషయమై తిరుపతినాయక్‌తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్‌కళ్యాణ్ సెక్యూరిటీగార్డు దాసరి వెంకటేశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. దీనిపై ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ అబ్ధుల్ అయ్యుం తెలిపారు.


