● కాకరవాణి ప్రాజెక్టులోకి
నీరు వచ్చేలా చూడాలి
● ఏర్పుమళ్ల నాయకులు,
రైతులు ఏకగ్రీవ తీర్మానం
బొంరాస్‌పేట: మండలంలోని కాకరవాణి ప్రాజెక్టుకు నారాయణపేట ఎత్తిపోతల పథకం నీరు వచ్చేలా చూడాలని నాయకులు, రైతులు కోరారు. గురువారం ఏర్పుమళ్లలో సర్పంచ్ బందెయ్య ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నారాయణపేట ఎత్తిపోతల పథకం నీరు మండలం వరకు వస్తున్నందున కాల్వను కాకరవాణి వరకు పొడిగించి నీరు నింపాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. బొంరాస్‌పేట, బురాన్‌పూర్, మహంతీపూర్, తుంకిమెట్ల తదితర గ్రామాల చెరువులకు ప్రాణాధారంగా ఉన్న కాకరవాణి చెరువును నిర్లక్ష్యం చేస్తూ నేరుగా బొంరాస్ పేట పెద్ద చెరువుకు నీళ్లు మళ్లించే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇలా చేయడం ద్వారా పది శాతం నీరు కూడా రాదన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మండల నాయకులు మహేందర్‌రెడ్డి, యాదగిరి, అంజిల్‌రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శి రమేశ్, జీపీఓ రాజు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


