తాండూరు టౌన్: ఇటీవల నల్లగొండ జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌక్‌లో ఉపాధ్యాయులు, పలు ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించి, ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అనంతరం పలువురు మాట్లాడుతూ.. గురుశిష్యుల బంధం ఎంతో ఉన్నతమైందని, సద్భుద్ధిని ప్రసాదించే ఉపాధ్యాయులపై కక్ష గట్టి విద్యార్థులు దారుణానికి పాల్పడటం క్షమించరానిదన్నారు. పిల్లలు వ్యసనాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో సమస్యను పరిష్కరించాలన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడకుండా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎండీ అఖీల్, ట్రస్మా తాండూరు అధ్యక్షులు, నాయకులు మోహన్ కృష్ణగౌడ్, కీర్తిశర్మ, నాగభూషణం, యూనస్, రాజశేఖర్ , శ్రీనివాస్, విజయ్ భాస్కర్, షబ్బీర్, పలు ప్రజా సంఘాల నాయకులు సోమశేఖర్, రాజ్‌కుమార్, షుకూర్, కె శ్రీనివాస్, రామకృష్ణ, పి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


