తాండూరు టౌన్: హిందూ ధార్మిక పరిషత్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో ఆదివారం తాండూరు నియోజకవర్గ స్థాయి బాలుర కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆ పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్ శుక్రవారం తెలిపారు. పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు తాండూరు పట్టణం, కోట్‌పల్లి మండలానికి చెందిన జెడ్పీ ఉన్నత పాఠశాలల నుంచి ఆరు బాలుర జట్లు బరిలో దిగనున్నట్లు చెప్పారు. పట్టణంలోని అక్షర ఉన్నత పాఠశాలలో జరగనున్న పోటీలకు టైటిల్ స్పాన్సర్‌గా శ్రీ సాయిపుత్ర హోమ్స్ సంస్థ వ్యవహరిస్తోందన్నారు. అలాగే తాండూరు పట్టణ టైటాన్స్ జట్టుకు మార్వాడీ యువమంచ్, తాండూరు మండల టైగర్స్ జట్టుకు స్సైస్ రెస్టారెంట్, పెద్దేముల్ లయన్స్ జట్టుకు గౌతమీ పాఠశాల, బషీరాబాద్ ఫైటర్స్ జట్టుకు అజయ్ ప్రసాద్, యాలాల ఈగల్స్ జట్టుకు ఆదిత్య ఆసుపత్రి, కోట్‌పల్లి కింగ్స్ జట్టుకు రాములు యాదవ్ యాజమాన్యంగా కొనసాగనున్నట్లు చెప్పారు. పోస్టర్ ఆవిష్కరణలో హిందూ ధార్మిక పరిషత్ సభ్యులు, తపస్, పిఆర్టీయూ, బిసి సంఘం, కబడ్డీ పోటీల స్పాన్సర్స్ తదితరులు పాల్గొన్నారు.


