కాలేజీ.. ఏ క్యాజీ! | - | Sakshi
Sakshi News home page

కాలేజీ.. ఏ క్యాజీ!

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

కరువైన వసతులు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: నాణ్యమైన వైద్య విద్య సంగతేమో కానీ.. కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేపోతున్నారు మహేశ్వరం మెడికల్‌ కాలేజీ విద్యార్థులు. వైద్య విద్య ఇక్కడ మిథ్యలా మారింది. నగరానికి సమీపంలో ఉందని, మౌలిక సదుపాయాలకు కొదవ ఉండదని భావించి.. అడ్మిషన్‌ పొందిన మెజార్టీ విద్యార్థులు ఆ తర్వాత తాము ఇక్కడెందుకు వచ్చిపడ్డామా అని ఆందోళనకు గురవుతున్నారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ కాలేజీని అనుబంధ ఆస్పత్రి సమీపంలోకి మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం కాలేజీ సందర్శనకు వచ్చిన అదనపు కలెక్టర్‌ కిరణ్మయికి విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఇదే అంశంపై మొరపెట్టుకున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ భవనాన్ని చూసి ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అద్దె భవనం.. అరకొర సదుపాయాలు

బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రభుత్వం జిల్లాకు మహేశ్వరం మెడికల్‌ కాలేజీని మంజూరు చేసింది. మీర్‌ఖాన్‌పేటలో ఏర్పాటు చేయాలని భావించి ఆ మేరకు అక్కడ స్థలాన్ని కేటాయించింది. 2023లో శంకుస్థాపన చేసింది. తీరా ప్రభుత్వం మారిపోవడంతో కాలేజీ.. ఎంపిక ప్రదేశం కూడా మారింది. సొంత క్యాంపస్‌ సహా కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినా ప్రభుత్వ కాలేజీ కావడంతో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కూడా అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. 2024లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది. 50 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్న ఈ కాలేజీలో ఇప్పటికే రెండు బ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. 2026–27లో మూడో బ్యాచ్‌ అడుగుపెట్టబోతోంది. కాలేజీకి సొంత భవనం లేకపోవడంతో అధికారులు మంగళ్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ.16 లక్షలు చెల్లిస్తున్నారు. విశాలమైన క్యాంపస్‌ సహా ఐదు అంతస్తుల భవనం ఉన్నట్లు ఎంసీఐకి చూపించారు. తీరా అడ్మిషన్లు పూర్తై..తరగతులు మొదలైన తర్వాత అసలు విషయం బయటపడింది. భవన యాజమాన్యం, అప్పటి అధికారులు కుమ్మకై ్క మార్కెట్‌లో లేని అద్దె నిర్ణయించారు. అద్దె పెంపు విషయంలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఆర్థికశాఖ నుంచి కాలేజీకి షోకాజ్‌ నోటీసులు అందినట్లు తెలిసింది. ఈనెల 31తో భవనం అద్దె గడువు ముగియనుంది. అద్దెను 20 శాతం పెంచాల్సిందిగా భవన యజమాని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఐదంతస్తుల ఈ భవనంలో రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తరగతి గదుల కిటికీలకు గ్లాసులు లేవు. చిన్నపాటి వర్షానికే గదుల్లోకి నీరు చేరుతోంది. చలిగాలులకు విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం, కాలేజీకి కరెంట్‌ కనెక్షన్‌, ఫ్యాకల్టీ గదుల్లో ఫ్యాన్లు లేవు. అయినా నెలకు రూ.ఐదు లక్షల వరకు కరెంట్‌ బిల్లుల చెల్లింపునకు కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం 60 శాతం మంది విద్యార్థులకు అదే క్యాంపస్‌లో వసతి కల్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇరుకై న ప్రైవేటు హాస్టల్‌ గదుల్లో ఇతర విద్యార్థులతో కలిసి ఉండాల్సి వస్తోంది. అంతేకాదు కాలేజీకి అనుబంధంగా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని ఎంపిక చేశారు. నిబంధనల మేరకు పది కిలోమీటర్లలోపే ఆస్పత్రి ఉండాలి. ఇక్కడ మాత్రం 18 కిలోమీటర్ల దూరం ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుబంధ ఆస్పత్రిలో పని చేసి, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసు రూమ్‌లో ఉండాల్సి వస్తోంది. ఇటు నుంచి అటు..అటు నుంచి ఇటు రాకపోకలకే రెండు గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్‌ రద్దీలో కాలేజీ నుంచి ఆస్పత్రికి వచ్చి వెళ్లడం విద్యార్థులకు ప్రహసనంగా మారింది. దీనిపై కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు.

అద్దె భవనంలో మహేశ్వరం మెడికల్‌ కళాశాల

కనీస మౌలిక సదుపాయాలు కరువు

అయినప్పటికీ భవనానికి

నెలకు రూ.16 లక్షల అద్దె

కాలేజీ ఒకచోట.. అనుబంధ ఆస్పత్రి మరోచోట

అటు, ఇటు తిరగలేక విద్యార్థుల అవస్థలు

ఎంసీఐ నిబంధనలు బేఖాతరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement