పంట రుణాల మాటెత్తని బ్యాంకర్లు సాగు ఖర్చుల కోసం అన్నదాతల పాట్లు వడ్డీ వ్యాపారుల గడప తొక్కుతున్న వైనం
వికారాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేయలేదు. బ్యాంకర్లు పంట రుణాల ఊసెత్తడం లేదు. దీంతో అన్నదాతలు పంట పెట్టుబడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల గడప తొక్కుతున్నారు. పంట రుణాలు ఇస్తారా.. ఇవ్వరా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆయా పంట రకాలను బట్టి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతం ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉన్నందున వడ్దీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
రుణ లక్ష్యం రూ.3,829 కోట్లు
ఏటా ఖరీఫ్ ప్రారంభానికి ముందే బ్యాంకర్లు రుణ ప్రణాళికను సిద్ధం చేస్తారు. జిల్లాలో ఎంత మంది రైతులు ఉన్నారు..? ఎన్ని ఎకరాల సాగు భూమి ఉంది..? ఇవ్వాల్సిన రుణాలు ఎన్ని వంటి పూర్తి వివరాలు సేకరిస్తారు. గతేడాది రూ.3,829 కోట్ల రుణ లక్ష్యంగా పెట్టుకోగా 60 శాతానికి మించి ఇవ్వలేదు. ఈ ఏడాది ఇంత వరకు రుణ ప్రణాళికే ప్రకటించలేదు. జిల్లాలో 2.5 లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రస్తుతం సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు ప్రక్రియను ప్రా రంభించారు. చాలా మంది రైతులు చేతిలో చిల్లిగ వ్వ లేక బ్యాంక్ రుణాల కోసం ఎదురు చూస్తు న్నారు. కొన్ని బ్యాంకులు రుణాలిచ్చే ప్రక్రియను ప్రారంభించినా కొర్రీలు పెడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. పలు కారణాలతో చాలా మందికి రుణమాఫీ కాలేదు. అలాంటి రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు ఎటూ తేల్చడంలేదు.
సాగు అంచనాలు 5.90లక్షల ఎకరాలు
జిల్లాలో 5.90లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఏటా ఎస్‌బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, డీసీసీబీ తదితర బ్యాంకులు సగటున రూ.3,500 నుంచి రూ.3,800 కోట్ల వరకు వ్యవసాయ రుణాలు ఇచ్చేవారు. ఈ ఏడు ఎంతే మేర ఇస్తారనేది ఇప్పటి వరకు తేలలేదు. జిల్లాలోని 3.20 లక్షల మందికి రైతు భరోసా నిధులు రూ.320 కోట్ల వరకు అందాల్సి ఉంది. సీజన్ ప్రారంభమైనా పంట పెట్టుబడి సాయం ఊసే లేదు. పంట రుణాల విషయమై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరిని వివరణ కోరగా త్వరలో రుణ ప్రణాళిక ప్రకటించి అమలు చేస్తామని తెలిపారు.
రైతు భరోసా ఊసెత్తని ప్రభుత్వం
పంట రుణాలివ్వాలి
ఏటా ఖరీఫ్ ప్రారంభం కాగానే బ్యాంకర్లు లోన్లు ఇచ్చేవారు. రెండు మూడేళ్లుగా సక్రమంగా పంట రుణాలు ఇవ్వడం లేదు. బ్యాంకులకు వెళ్లినా సరైన సమాధానం చెప్పడం లేదు. రైతు భరోసా నిధులు కూడా అందలేదు. ప్రభుత్వం, బ్యాంకర్లు వెంటనే చర్యలు చేపట్టాలి.
– కాశయ్య, రైతు, మల్లెపల్లి
జిల్లాలో రైతుల సంఖ్య 3.20 లక్షలు
సాగు విస్తీర్ణం 5.90 లక్షల ఎకరాలు
అందాల్సిన రైతు భరోసా రూ.320 కోట్లు


