ధారూరు: రైతులను ఇబ్బంది పెట్టే ఎరువుల దుకాణాలపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ దీపక్ తివారి హెచ్చరించారు. మంగళవా రం మండల కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను, మన గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాపు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధారూరుకు 29 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంపై ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుతోనే లబ్ధిదారులకు ఇళ్ల బిల్లు లు రావడం లేదని కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రెండు రోజుల్లో ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. వారానికి ఒక్కసారి కూడా మిషన్ భగీరథ నీరు రావడం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బాబాఖాన్ ఫిర్యాదు చేశారు. నీటి సరఫరాలోనే సమస్య ఉందని మిషన్ భగీరథ అధికారి చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. అనంతరం మన గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. విత్తనాలు, క్రిమి సంహారక మందులు కొన్న వారికే డీఏపీ, యూరియా ఇస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. స్థానిక వ్యవసాయ అధికారి ఏం చేస్తున్నారని డీఏఓ రాజరత్నంను ప్రశ్నించారు. ఇకముందు ఇలా చేస్తే పోలీస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధరల బోర్డు డిస్‌ప్లే చేయాలని నిర్వాహకులకు సూచించారు. 460 బస్తాల యూరియా ఉన్నా ఆన్‌లైన్‌లో బుక్ కాకపోవడంపై ఆరా తీశారు. ఎందుకిలా జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన వడ్లు, జొన్నలను వెంటనే మిల్లులు, గోదాంకు తరలించాలని తెలిపారు. అనంతరం తాండూరు – హైదరాబాద్ మార్గంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిగ్గా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు బాబాకాన్, అమరేశ్ర్‌రావు, ఇబ్రహీం ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సాజిదాబేగం, ఏఓ సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


