కుల్కచర్ల: ప్రజా అవసరాలు, జనాభా, ప్రాదేశిక దూరాల ప్రకారం మండల పరిధిలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని మండల వాసులు ఏళ్ల నుంచి ప్రభుత్వాలను కోరుతున్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సైతం కుల్కచర్ల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఎర్పాటుచేయాల్సిన అవసరం అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ఏడాది గడిచినా అతీగతీ లేకుండా పోయింది. అగ్నిప్రమాద ఘటనలు వాటి నివారణకు అవసరమైన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ప్రజలు కోరుతున్నారు.
దూరభారంతో నష్ట తీవ్రత
అగ్నిమాపక కేంద్రం సమీపంలో లేక ప్రజల ఆస్తులు కాలిబూడిదవుతున్నాయి. ప్రమాదం జరిగిందంటే అక్కడ నష్టం వాటిళ్లడం తప్పితే అగ్నిమాపక వాహనం వచ్చి ఆర్పి నష్ట నివారణ చేసిన ఘటనలు మచ్చుకు కూడా లేవు. ప్రస్తుతం పరిగి నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఉంది. కుల్కచర్ల మండల కేంద్రానికి పరిగి 22 కిలోమీటర్ల దూరం ఉంది. కుల్కచర్ల నుంచి ఇతర ప్రాంతాలు సైతం దూరంగా ఉండటంతో ఫైరింజన్ వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. చౌడాపూర్, మక్తవెంకటాపూర్, కుస్మసముద్రం, అనంతసాగర్, సాల్వీడు, చెల్లాపూర్ తదితర గ్రామాలకు వెళ్లాలంటే మరో 10–15 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఫైరింజన్ చేరుకునేందుకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
మండల పరిధిలో జరిగిన ప్రమాదాలు
● రెండేళ్ల క్రితం మండల కేంద్రంలో చందు బట్టలదుకాణం అగ్నికి ఆహుతైంది.
● గతేడాది ఫిబ్రవరిలో గోరిగడ్డతండాలో వడిత్య పాండు ఇంట్లో గ్యాస్ లీకై న ఘటనలో మంటలు చెలరేగి కుటుంబీకులంతా తీవ్రంగా గాయపడ్డారు.
● ఏ ఏడాది ఫిబ్రవరిలో సాల్వీడులో పాలెపల్లి రాములు గడ్డివాము దగ్ధమైంది.
● ఏప్రిల్‌లో మందిపల్ ఓంకారేశ్వరాలయంలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం జరిగింది.
● రెండు నెలల క్రితం పేపర్ ప్లేట్ల దుకాణంలో మంటలు చెలరేగి తీవ్ర నష్టం వాటిళ్లింది.
● వారం క్రితం వరి పంట కోస్తున్న సమయంలో పర్సపురం మైపాల్‌కు చెందిన హార్వెస్టర్ మంటలు చెలరేగి రూ.25 లక్షలు నష్టపోయాడు.
అగ్నిమాపక కేంద్రం హామీలకే పరిమితం
అసెంబ్లీలో ప్రస్తావించినా అమలుకు నోచుకోని వైనం
కాలిబూడిదవుతున్న ఆస్తులు


