మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి
మోమిన్‌పేట: రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల మహిళ సమాఖ్యకు ప్రభుత్వం అందించిన బస్సును కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హమీ మేరకు మహిళ సంఘాలకు బస్సులను అందించామన్నారు. పలు మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులను ఏర్పాట్లు చేశామని వివరించారు. రూ.36లక్షల విలువైన బస్సుతో ప్రతీ నెల స్థిరమైన ఆదాయం వస్తుందని చెప్పారు. ఆర్టీసీ అద్దెకు ఇస్తే ప్రతీ నెలకు రూ.69 వేల చొప్పున మహిళా సమాఖ్యకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్, మహిళ సమాఖ్య మండల అధ్యక్షురాలు భాగ్యమ్మ, నాయకులు సంగమేశ్‌గౌడ్, నర్సింలు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళా సమాఖ్య అభివృద్ధికి కృషి
దోమ: మహిళా సమాఖ్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీఎం శోభ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నూతన ఆర్టీసీ బస్సును కొనుగోలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సమాఖ్యకు ప్రభుత్వం రూ.30లక్షలు ఇవ్వగా, రూ.6 లక్షలతో నూతన బస్సు కొనుగోలు చేశామన్నారు. హైదారాబాద్‌లో నిర్వహిస్తున్న సీఎం సభకు నూతన బస్సులో మహిళలను తరలించి సభను విజయవంతం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతే లక్ష్యం
కుల్కచర్ల: మహిళ సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కాంగ్రెస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు శేఖర్, మాజీ అధ్యక్షుడు ఆశోక్ కుమార్ అన్నారు. మంగళవారం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నూతనంగా బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నాగరాజు, నరసింహ నాయక్, నవీన్, రామ్మోహన్ శర్మ, శివరాములు, ఉమాపతిరెడ్డి, రామాంజనేయులు, వెంకటయ్య, మహిళ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


