కుల్కచర్ల: తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోతున్నారు. కుల్కచర్ల మండలంలో గురువారం చోటుచేసుకున్న ఓ దోపిడీ ఘటన సినిమా దృశ్యాలను తలపించింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పుట్టపహాడ్ గ్రామానికి చెందిన బేతి మొగులయ్య ఉదయాన్నే తన భార్యతో కలిసి ఉపాధిహామీ పనులకు వెళ్లారు. సుమారు 11:30 గంటలకు వీరి ఇంటి తాళం పగులగొట్టిన ఇద్దరు దొంగలు లోపలికి ప్రవేశించారు. ఎదురుగా ఉన్న ఆలయ పరిసరాల్లో ఆడుకుంటున్న మొగులయ్య కొడుకు రాహుల్(చింటు) ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించి అమ్మానాన్నా వచ్చారని లోపలికి వెళ్లాడు. అప్పటికే స్టీల్ గల్లా పెట్టెను ధ్వంసం చేసిన దుండగులు అందులోని రూ.60 వేలు, 16 తులాల వెండిని తీసుకున్నారు. లోపలికి వెళ్లిన పన్నెండేళ్ల చింటును కత్తితో బెదిరించడంతో భయపడిన బాలుడు బయటకు పరుగుతీశాడు. హైస్కూల్ వద్ద ఆడుకుంటున్న యువకుల ఫోన్‌తో తండ్రికి ఫోన్ చేయగా హుటాహుటిన ఇంటికి వచ్చారు. అప్పటికే దుండగులిద్దరూ బైక్‌పై పారిపోయారు. చోరీ జరిగిందని గుర్తించిన మొగులయ్య, స్థానికులు విషయాన్ని సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు గ్రామ నాయకులకు తెలియజేశారు. అంతా కలిసి సమీపంలోని పలు సీసీ పుటేజీలను సేకరించి, పెన్‌డ్రైవ్ తీసుకుని కుల్కచర్లలోని పీఎస్‌కు చేరుకున్నారు. పోలీసులు, గ్రామస్తులు ఈ పుటేజీలను పరిశీలిస్తుండగా.. స్టేషన్ మెట్లపై కూర్చున్న చింటు.. రోడ్డు మీద బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని గమనించి ‘నాన్నా.. అదిగో దొంగలు.. మనింటికి వచ్చింది వాళ్లే’ అంటూ అరిచాడు. ఈ మాటలు విన్న పోలీస్ వెహికిల్ డ్రైవర్ అంజిరెడ్డి పోలీసులను అప్రమత్తం చేసి బైక్‌ను వెంటాడారు. ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత, బైక్‌ను దాటేసి కారును రోడ్డుకు అడ్డంగా నిలిపాడు. అతివేగంగా వచ్చిన దొంగలకు బైక్ కంట్రోల్ కాకపోవడంతో కారును ఢీకొట్టి కిందపడిపోయారు. వీరిలో ఒకరిని అంజిరెడ్డి పట్టుకోగా, మరో దొంగ పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. పది నిమిషాలలోపు బైక్‌లపై అక్కడికి చేరుకున్న పోలీసులు మరో దొంగ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో బైక్‌ను, దొంగను తీసుకుని పీఎస్‌కు తరలించారు. పట్టుబడిన వ్యక్తి జడ్చర్లకు చెందినవాడిగా గుర్తించారు. వీరు ప్రయాణించిన బైక్‌ను కర్నూలులో చోరీ చేసినట్లు తెలిసింది. పారిపోయిన దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


