దొరకని గ్యాస్‌.. హోటళ్లు క్లోజ్‌ | - | Sakshi
Sakshi News home page

దొరకని గ్యాస్‌.. హోటళ్లు క్లోజ్‌

Mar 16 2026 9:00 AM | Updated on Mar 16 2026 9:00 AM

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మంటలు మన టిఫిన్‌ సెంటర్లు, టీ స్టాళ్లను తాకాయి. ఇప్పటికే గృహ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచిన విషయం తెలిసిందే. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో సిలిండర్ల కోసం ఆయా ఏజెన్సీల ముందు జనం క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఉన్న సిలిండర్లు ఖాళీ కావడం, కొత్తగా బుక్‌ చేసినప్పటికీ సకాలంలో సరఫరా లేకపోవడంతో చిన్నచిన్న టిఫిన్‌ సెంటర్లు, టీ స్టాళ్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చేతినిండా పనితో బిజీగా ఉన్న వంటమనుషులు, సప్లయర్లు ప్రస్తుతం పని లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అధికారుల ప్రకటనలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. గ్యాస్‌కు కొరత లేదని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తుండటం గమనార్హం.

ఇరుగు పొరుగు సహకారం కరువే

జిల్లాలోని మూడు ఆయిల్‌ కంపెనీల పరిధిలో 14.93 లక్షలకుపైగా గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. వీటిలో 12 వేలకుపైగా కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి రోజుకు సగటున 22 వేల రీఫిల్స్‌ బుకింగ్స్‌ ఆర్డర్స్‌ ఉండగా, ప్రస్తుత సంక్షోభంలో ముందస్తు బుకింగ్స్‌ 26 వేలకు చేరడం విశేషం. నిన్న మొన్నటి వరకు ఖాళీగా ఉన్న సిలిండర్లను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నింపి పెట్టుకుంటుండటమే ఇందుకు కారణమని తెలిసింది. మెజార్టీ టిఫిన్‌ సెంటర్లు, టీస్టాల్‌ యజమానులు కమర్షియల్‌ కనెక్షన్లు తీసుకోలేదు. బంధువులు, ఇరుగు, పొరుగు వారి నుంచి ఖాళీ సిలిండర్లను సేకరించి, రీఫిల్‌ చేసుకుని వాడుకునే వారు. వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు పెంచడం, కొత్త కనెక్షన్ల మంజూరుకు నిరాకరిస్తుండటం, ప్రస్తుతం ఇరుగు పొరుగు నుంచి కూడా ఆశించిన సహకారం లభించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో టిఫిన్‌ సెంటర్లు, టీస్టాల్‌ యజమానులు తమ హోటళ్లను మూసి వేస్తున్నారు.

ఇంట్లో పిండి వంటలు బంద్‌

వంటింట్లో గ్యాస్‌ సంక్షోభం నేపథ్యంలో సింగిల్‌ సిలిండర్‌ కనెక్షన్లు ఉన్న వాళ్లు పిండి వంటలు బంద్‌ చేశారు. బయటి ఫుడ్డుతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని భావించి తమ పిల్లలకు వివిధ రకాల స్నాక్స్‌ చేసి పెట్టే తల్లులు ప్రస్తుతం పండ్లు, రెడీమేడ్‌ బేకరీ ఫుడ్డును బాక్సుల్లో సర్దుతున్నారు. వారం, పది రోజులకోసారైనా ఇంట్లో తయారు చేసుకునే పిండివంటలను గ్యాస్‌ ఎక్కువ ఖర్చవుతుందనే భయంతో మానేశారు.

ఆలస్యమైతే కాల్‌ చేయండి

గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని ఆయిల్‌ కంపెనీలు సూచించాయి. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్‌ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్‌ డెలివరీ చేయాల్సి ఉంటుంది. డెలివరీ ఆలస్యమైతే ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు 1800–2333–555 లేదా 77189 55555కు, భారత్‌ గ్యాస్‌ కస్టమర్లు 1800–22–4344 లేదా 77150 12345కు, హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులు 1800– 2333–555 లేదా 94936 02222కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

నిలిచిన కివి పండ్ల దిగుమతులు

యుద్ధ వాతావరణం బాటసింగారం పండ్ల మార్కెట్‌పైనా ప్రభావం చూపుతోంది. ఇరాన్‌ నుంచి ఇక్కడి మార్కెట్‌కు కివీ, యాపిల్‌, కర్జూర పండ్లు దిగుమతి అవుతుంటాయి. యుద్ధం కారణంగా దిగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్‌ సహా నగరంలోని ఏ పండ్ల మార్కెట్లో కూడా కివీ పండ్లు దొరకడం లేదు. న్యూజిలాండ్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ నుంచి కొద్ది మొత్తంలో దిగుమతి అవుతున్నా నగరవాసులు అవసరాలు తీర్చలేకపోతున్నాయి. ఇరాన్‌ నుంచి యాపిల్‌ దిగుమతి లేకపోవడంతో సిమ్లా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాపిల్‌ ధరలు కూడా అమాంతం పెరిగాయి.

అదనపు చార్జీల వడ్డన

అంతో ఇంతో గ్యాస్‌ నిల్వలు ఉన్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు అమాంతం ధరలు పెంచేశాయి. నిన్న మొన్నటి వరకు ఓ సాధారణ టిఫిన్‌ సెంటర్‌లో ప్లేటు ఇడ్లీ, వడ, పూరి ధర రూ.40 ఉండగా, ప్రస్తుతం రూ.60 వరకు పెంచారు. సింగిల్‌ టీ ధర రూ.10 నుంచి రూ.15కు పెంచేశారు. అదేమంటే గ్యాస్‌ సర్‌ చార్జీ అంటున్నారు. మెజార్టీ హోటళ్లలో మెనూలోని ఐటెమ్స్‌ సగానికి తగ్గించారు. గ్యాస్‌ ఎక్కువ ఖర్చయ్యే ఆహార పదార్థాలను వండడం మానేశారు. తక్కువ సమయంలో ఉడికే ఆహార పదార్థాలనే రెడీ ఫర్‌ ఈట్‌ ప్లేస్‌లో ఉంచుతున్నారు. ఇక కేటరింగ్‌ సంస్థలు సైతం ధరలను అమాంతం పెంచేశాయి. రోజుకు కనీసం వెయ్యి మందికి 20 రకాల ఐటమ్స్‌ సరఫరా చేసేవారు రెండు మూడింటితో సరిపెడుతున్నారు.

జిల్లాలో గ్యాస్‌ వినియోగం ఇలా.

డొమెస్టిక్‌ సిలిండర్లు 14,93,250

వాణిజ్య సిలిండర్లు 12,708

రోజుకు సగటున రీఫిల్‌ బుకింగ్స్‌ 22,500

ప్రస్తుతం బుకింగ్స్‌ 26,300

నిండుకున్న వాణిజ్య సిలిండర్లు.. నిలిచిన సరఫరా

మూతపడుతున్న టిఫిన్‌ సెంటర్లు..

టీ స్టాళ్లు

తెరిచి ఉన్న వాటిల్లోనూ

అదనపు చార్జీల వడ్డన

రోజురోజుకూ మరింత

ముదురుతున్న సంక్షోభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement