● పోల్కంపల్లి రహదారి పనులు చేపట్టండి
● సీపీఎం జిల్లా నాయకుడు జగన్
ఇబ్రహీంపట్నం రూరల్: పోల్కంపల్లి– రాయపోల్ అధ్వాన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం పార్టీ జిల్లా నాయకులు పీ.జగన్ డిమాండ్ చేశారు. గుంతలయమమైన రోడ్డులో ప్రయాణం నరక ప్రాయంగా మారిందన్నారు. రోడ్డు మరమ్మతు చేయాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోతులు ఏర్పడి రోడ్డు రూపం కోల్పోయిందన్నారు. మరమ్మతు పనులు చేయించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో రోడ్డు పునరుద్ధరణకు రూ.56 లక్షలు మంజూరయ్యాయని, అయినా పనులు చేపట్టడం లేదన్నారు. ఇరాన్– ఇరాక్ యుద్ధం నేపథ్యంలో ప్రజలకు గ్యాస్ కష్టాలు వచ్చాయని, అవసరాల మేరకు సరిపడా బండను సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు చెరుకూరి నర్సింహ, శాఖ కార్యదర్శులు నర్సింహ, కరుణాకర్‌రెడ్డి, యాదయ్య, నాయకులు గూడెం అశోక్, బాల్‌రాజ్, ధనేశ్వర్, శ్రీనివాస్, పాండు, వెంకటేశ్, శివ, జంగయ్య, యాదగిరి, బాలయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు.


