షాద్‌నగర్‌రూరల్: మున్సిపల్ పరిధి చటాన్‌పల్లి శివారులో ఉన్న ఆర్సిడో లారెల్ స్ప్రింగ్ వెంచర్ ప్రహరీని కూల్చారని వెంచర్ యజమాని మిట్టపల్లి యాదగిరి బుధవారం ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సుశీల, బాధితుడు తెలిపిన ప్రకారం.. సర్వే నంబర్ 529పీ, 530పీ, 554పీ, 556పీ, 557పీ, 558లోని 28 ఎకరాలలో రెరా అనుమతులను తీసుకుని వెంచర్ చేశారు. సంబంధంలేని సర్వే నంబర్ 534లో తనకు భూమి ఉందని చటాన్‌పల్లికి చెందిన శివకుమార్, రాజుగౌడ్, రామకృష్ణ, భాస్కర్‌గౌడ్, రాజు, శ్రీశైలం, జంగయ్య, యాదగిరి, అశోక్, చెన్నయ్య, గిరి, రమేశ్, చిన్నచంద్రయ్య వెంచర్‌లోకి ప్రవేశించి ప్రహరీ కూల్చి వేశారు. ఆ వీడియోలు పంపి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేశారని తెలిపాడు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ అన్నిశాఖలనుంచి అనుమతులను తీసుకున్న తరువాతనే వెంచర్‌చేసి గోడను నిర్మించామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
టిప్పర్ బోల్తా
డ్రైవర్‌కు గాయాలు
ధారూరు: టిప్పర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన ధారూరు – గట్టెపల్లి బస్‌స్టేజ్ మధ్య బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ నుంచి కంకర లోడుతో టిప్పర్ తాండూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున ధారూరుకు రాగానే బారికేడ్‌ను ఢీకొట్టింది. వంద మీటర్ల వరకు వాహనం అలాగే వెళుతుండటంతో పోలీసులు గమనించి వెంబడించారు. అయినా వాహనం ఆపకుండా తాండూరు వైపు వేగంగా వెళ్లింది. సోమశంకరప్ప గుడి దాటిన తర్వాత రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి గుంతలో పల్టీ కొట్టింది. డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుకు ఫిర్యాదు అందలేదు.
ఆలయ పరిరక్షణకు
కృషి చేస్తున్నాం
సంజీవయ్య ఆలయ ధర్మకర్త పార్థసారథి
పరిగి: దోమ మండలంలో సంజీవయ్య ఆలయ పరిరక్షణ కోసం తమ తాతముత్తాల నుంచి కాపాడుతూ వచ్చామని ధర్మకర్త పార్థసారథి పంతులు అన్నారు. సంజీవయ్య ఆలయ భూములపై బుధవారం పట్టణ కేంద్రంలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్మాణం కోసం తాము ఎంతో కృషి చేస్తున్నామన్నారు. సొంత ఖర్చులతో ఆలయం నిర్మిస్తామని చెబితే దేవాదాయ శాఖ ఒప్పుకోలేదన్నారు. తమ వందల ఎకరాల భూమి సీలింగ్‌లో పోయిందని, కానీ దేవాలయ భూములు తామే అన్యాక్రాంతం చేశామని కొందరూ అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. జనవరిలోనే దేవాలయ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ నుంచి అనుమతి వచ్చిందని, ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రారంభించలేదని చెప్పా రు. దేవాలయ పరిరక్షణ సమితి పేరుపై కొందరు చేస్తున్న దీక్షలు ఉత్తవేనని అది పరిరక్షణ సమితి కాదని భూ భక్షసమితి అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పరిగిలోని 383 సర్వే నంబర్‌లో 16 ఎకరాల భూమిలో 9 ఎకరాలు దేవాలయ భూమి ఉందన్నా రు. ఆ భూమి ఎలా మరిందనే విషయం తమకు తెలియదని తెలిపారు. భూములు అన్యాక్రాంతం అవుతుంటే తాను తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆలయం పేరుపై ఖాతాలో రూ.19లక్షలు జమ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, నాయకులు వెంకటేష్, శివకుమార్, చిన్ననర్సింహులు, ఆంజనేయులు, మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బెల్టుషాప్‌పై దాడులు
పహాడీషరీఫ్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్టుషాప్‌పై పహాడీషరీఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. హార్డ్‌వేర్ పార్కులోని శివ కిరాణ జనరల్ స్టోర్‌లో దాడులు చేయగా రూ.17వేల విలువైన 88 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అరెస్ట్ చేశామన్నారు.


