‘ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడొద్దు’
మణికొండ: ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య ప్రముఖ్ పి.బాలస్వామి, రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ సంయుక్త కార్యదర్శి తలారి రాములు హెచ్చరించారు. కోకాపేట విశాఖ శారదా పీఠం స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం జలమండలికి కేటాయించిందనే విషయం తెలుసుకున్న వారు ఆదివారం ఉత్తర పీఠాధిపతిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మఠాలు, పీఠాలు, మందిరాలపై దాడులు చేస్తే సహించమన్నారు. సనాతన సంప్రదాయాల పరిరక్షణలో స్వామీజీలు, పీఠాధిపతులు చేస్తున్న సేవలు అపారమైనవని వారిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని, వారికి హిందూ సమాజం బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నార్సింగి నగర కార్యవాహ సురేశ్, సంపర్క సందీప్‌రెడ్డి, సేవా ప్రముఖ్ పోచయ్య, వీహెచ్‌పీ నాయకులు రామారావు, రంగనాథ్, అంకిత్, మహేశ్, శంకర్ పాల్గొన్నారు.
శారదా పీఠానిదే భూమి
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన భూమిని యధావిధిగా వారికే ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో కలిసి ఆదివారం ఉత్తర పీఠాధిపతి స్వాత్యానన్నేంద్రస్వామిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం సీఎం తీసుకున్న నిర్ణయాన్ని పీఠాధిపతికి వివరించామన్నారు. జలమండలి అధికారులు అక్కడ నిర్మాణాలు లేవని ఇచ్చిన తప్పుడు నివేదికతోనే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని, తప్పును గ్రహించి వెంటనే వెనక్కి తగ్గిందన్నారు.


