ఆల్ ద బెస్ట్
వికారాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష కేంద్రాల్లో హాల్ టికెట్ నంబర్లు వేసే ప్రక్రియ పూర్తయ్యింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. 8 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 5 నిమిషాల ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు ఇంటర్ బోర్డు జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ తెలిపారు. చెప్పారు. 30 నిమిషాల ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పరీక్షల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. పరీక్ష జరిగే సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. 28 మంది ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ నెల 25న ప్రారంభమై మార్చి 24తో పరీక్షలు ముగియనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 6,708 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,686 మంది పరీక్షలు రాయనున్నారు. సెకెండ్ ఇయర్‌లో 6,549 మంది జనరల్ విద్యార్థులు, 1,457 మంది ఒకేషనల్ పరీక్షలకు హాజరు కానున్నారు.
మాస్ కాపీయింగ్ కట్టడికి చర్యలు
మాస్ కాపీయింగ్ కట్టడికి జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యార్థులు చూసి రాస్తే ఇన్విజిలేటర్లను బాధ్యులను చేయనున్నారు. గతంలో పదో తరగతిలో మాస్ కాపీయింగ్, అందులో ఉపాధ్యాయుల ప్రమేయంతో జిల్లాలో గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇంటర్ బోర్డు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షల నిర్వహణలో పొరపాట్లు జరిగితే ఇన్విజిలేటర్లు, ఇంటర్ బోర్డు అధికారులు, ప్రిన్సిపాళ్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు.
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడపాలని ఆ శాఖ అధికారులను విద్యాశాఖ సూచించింది. ఎగ్జామ్స్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఈ సారి మరింత మెరుగైన ఫలితాల కోసం చర్యలు చేపట్టామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. మూడు నెలల ముందు నుంచే విద్యార్థులపై ప్రత్యేక శద్ధ్ర తీసుకుని పరీక్షలకు సిద్ధం చేశామని ఇంటర్ బోర్డు జిల్లా నోడల్ అధికారి శంకర్ తెలిపారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
పర్యవేక్షిస్తున్న కలెక్టర్ ప్రతీక్‌జైన్
ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 8,394
సెకండ్ ఇయర్‌లో 8,006 మంది
పరీక్ష కేంద్రాలు 28


