విద్యా రంగంపై వివక్ష వద్దు
● బడ్జెట్‌లో 20శాతం నిధులు కేటాయించాలి
● ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు గీత
అనంతగిరి: విద్యా రంగంపై వివక్ష చూపరాదని, రాష్ట్ర బడ్జెట్‌లో 20శాతం నిధులు కేటాయించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు గీత డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్‌లోని బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యాలయంలో మదర్స్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అరకొర నిధులు కేయించడం సరికాదన్నారు. ప్రస్తుతం కేటాయించిన 7.3శాతం నిధులు సిబ్బంది జీతాలకే సరిపోతాయని పేర్కొన్నారు. అనంతరం మదర్స్ కమిటీ జిల్లా అధ్యక్షులు బిస్మిల్లా బేగం మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం విద్యకు 20శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ శివరాజ్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, అంజమ్మ, పోచమ్మ, ప్రసన్న రాణి, సునీత, ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, ఆశలత, దేవకుమారి, ఉమాదేవి, శ్రీలత, శిరీష తదితరులు పాల్గొన్నారు.


