సమయం ఇచ్చి భూ సర్వే చేపట్టండి
● సంట్రకుంట తండా రైతుల విన్నపం
● తాత్కాలికంగా ఆపేసిన అధికారులు
● నన్యనాయక్ తండాలో సర్వే ప్రక్రియ పూర్తి
దుద్యాల్: మండలంలోని పలు గ్రామాల్లో రైతుల భూముల సర్వే రెండో రోజు కొనసాగుతోంది. ఈర్లపల్లి, నన్యనాయక్ తండాల్లో ప్రక్రియ పూర్తయినట్లు తహసీల్దార్ కిషన్ మంగళవారం తెలిపారు. సంట్రకుంట తండాలో సర్వే పనులు ఆపాలని రైతులు కోరారు. తమ భూముల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకున్న తర్వాత సర్వే చేపట్టాలని కోరారు. దీంతో జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్, తహసీల్దార్ కిషన్ రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కాస్తులో ఉన్నా మా పేరిట రెవెన్యూ అధికారులు పట్టాలు చేయలేదని ఫిర్యాదు చేశారు. భూమి పట్టాలు లేకున్నా పరిహారం అందేలా చూడాలని కోరారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భూ సర్వేకు సహకరించాలని కోరారు. కుటుంబ సభ్యులు చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందుకు ఒక్క రోజు అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత తహసీల్దార్‌కు సమాచారం ఇస్తే సర్వే ప్రారంభిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. అందుకు రైతులు అంగీకరించారు. ప్రభుత్వానికి భూమి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నన్యనాయక్ తండా రైతులు తెలిపారు. నన్యనాయక్ తండా, సంట్రకుంట తండా, ఈర్లపల్లి గ్రామాల్లో 362.23 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో 213.37 ఎకరాల అసైన్డ్ భూమి, 148.86 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి.
భారీగా మోహరించిన పోలీసులు
సర్వే సమయంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. ముందు హద్దులు గుర్తించి ఆ తర్వాత సర్వే పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడంగల్ సీఐ, తహసీల్దార్ కిషన్ రైతులకు సర్ది చెప్పడంతో పరస్థితి అదుపులోకి వచ్చింది.
పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సన్నాహాలు
దుద్యాల్ మండలంలో మరో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే భూ సర్వే చేస్తున్నట్లు తెలిసింది. గతంలో హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి గ్రామాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాట్లు కోసం 1,200 ఎకరాల భూమిని సేకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో 56 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం నన్యనాయక్ తండా, సంట్రకుంట తండా, ఈర్లపల్లి గ్రామాల్లో 362.23 ఎకరాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది. రైతులు ఏ మేరకు అంగీకరిస్తారో వేచి చూడాలి. కార్యక్రమంలో ఆర్‌ఐ నవీన్‌కుమార్, డీటీ శివకుమార్, సర్వేయర్లు మహేశ్, ఆనందర్, శ్రీను, రెవెన్యూ సిబ్బంది సందీప్, సుశీల్, కిరణ్, నాగార్జున రెడ్డి, వెంకటాచారి, గోపి తదితరులు పాల్గొన్నారు.


